కలం కదిలిస్తే అద్భుతమైన గీతం… మాట కదిలిస్తే మధురమైన భావం… మనిషిని చూస్తే అమాయకతత్వం… ఇదీ యువ గీత రచయిత అనంత శ్రీరామ్ గురించి తెలిసినవాళ్లు చెప్పే మాటలు. ఆయన్ను చూడగానే… ‘ఈ కుర్రాడు భలే సాఫ్ట్’ అని అనుకుంటారంతా. ఆయన పాటలు కూడా అలానే ఉంటాయి. అయితే తన ఇమేజ్‌కు భిన్నంగా కనిపించి… ఒక్కసారిగా అందరికి షాక్ ఇచ్చారు అనంత శ్రీరామ్. ఆయన జడ్జిగా వ్యవహరిస్తున్న ఓ టీవీ షో కార్యక్రమం కోసం అలా మారారు. ఇంతకీ ఏమైందంటే…
అనంత శ్రీరామ్… ప్రేమ పాటలకు ప్రసిద్ధి అనొచ్చు. ఇంజినీరింగ్ చదివే రోజుల్లోనే గేయ రచయితగా మారిన అనంత శ్రీరామ్… చిన్న వయసులోనే మంచి సాహిత్యంతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. 37 ఏళ్ల అనంత శ్రీరామ్… ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అప్పుడే 17 ఏళ్లు పూర్తయ్యాయి. ఆయన తొలిసారిగా ఓ టీవీ షోకు జడ్జిగా విచ్చేశారు. జీ తెలుగులో ‘సరిగమప’ లో న్యాయనిర్ణేతగా ఉన్నారు. ఈ క్రమంలో షో ఎపిసోడ్ ఎంట్రీ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.
అందరి జడ్జిల్లాగే అనంత శ్రీరామ్ కూడా స్టేజీ మీదకు వస్తారని అందరూ ఆశించి ఉంటారు. అయితే ఆయన తన స్టైల్ మామూలుగా ఉండదు అంటూ… అదరగొట్టేశారు. నెమ్మదిగా నడుచుకుంటూ స్టేజీ మీదకు వచ్చిన అనంత శ్రీరామ్… డ్యాన్సర్లతో లైట్ లైట్ మూమెంట్స్ వేశారు. కాన్ఫిడెన్స్ బాగా వచ్చిందేమో వెంటనే గాల్లోకి ఎగిరి రెండు కాళ్లను చేతులకు తాకిస్తూ స్టెప్ వేశారు. ఆ వెంటనే ఫ్లోర్ మూమెంట్ కూడా వేసేశారు. ఆ వీడియోను ఓ నెటిజన్ షేర్ చేస్తే… ఇప్పుడది వైరల్‌గా మారింది.
ఎప్పుడూ సాఫ్ట్‌గా కనిపిస్తూ, అలానే మాట్లాడే అనంత శ్రీరామ్‌లో ఈ యాంగిల్ చూసి వామ్మో అనుకున్నారు అభిమానులు, నెటిజన్లు. మాటలు, పాటలతోనే కాదు, వీలైతే డ్యాన్స్‌తో కూడా అదరగొట్టేస్తా అని చెప్పాడు. ఆ స్టెప్పుల్లో ఈజ్ చూస్తుంటే కాలేజీలో చదువుకునే రోజుల్లో డ్యాన్స్ వేసిన అనుభవం ఉందనిపిస్తోంది. అందుకే ఇలా స్టెప్పులతో అదరగొట్టారు. మరి మీరేమంటారు.