రీసెంట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లోకి వచ్చిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, ప్రముఖ కథానాయకుడు పవన్ కల్యాణ్ భార్య అనా కొణిదెల తెగ సందడి చేస్తున్నారు. తన దైనందిన కార్యక్రమాలతోపాటు, కొన్ని ఆసక్తికర విషయాలను ఎప్పటికప్పుడు పోస్ట్‌లు, స్టోరీల ద్వారా షేర్ చేస్తున్నారు. అలా ఇటవల క్యూ అండ్ ఏ కార్యక్రమం నిర్వహించారు. ‘నన్ను ప్రశ్నలు అడగండి.. అందులో నాకు ఆసక్తిగా అనిపించిన ఓ పది ప్రశ్నలకు సమాధానాలు చెబుతాను’ అంటూ ఇటీవల చెప్పారు. దీంతో పవన్ అభిమానులు, నెటిజన్లు కొన్ని ప్రశ్నలు అడిగారు.
అందులో అందరినీ అలరించిన, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రశ్న.. ‘మీరు వండే వాటిలో పవన్ కల్యాణ్‌కు బాగా నచ్చే ఫుడ్ ఏంటి?’ అంటూ ఓ అభిమాని ప్రశ్న అడిగారు. దానికి అనా చెప్పిన సమాధానం, అలాగే ఆ సమాధానం చెప్పిన తీరు ఇప్పుడు ఆ పోస్ట్ బాగా వైరల్ అవ్వడానికి కారణమవుతోంది. తొలుత సమాధానాలు చూసి ఆ తర్వాత ఆమె ఎలా చెప్పారో చూద్దాం. పవన్‌కి చికెన్ కర్రీ అంటే ఇష్టం అని చెప్పిన అనా.. చేపల పులుసు అన్నా కూడా కూడా ఇష్టమే అని చెప్పారు.
ఇక వైరల్ అవ్వడానికి అసలు కారణం చూస్తే.. పవన్ ఇష్టపడే చికెన్ కర్రీని వండటం ఆయన మాతృమూర్తి (మా అత్తమ్మ అంజనా దేవి) దగ్గర నేర్చుకున్నాను అని చెప్పారు. అలాగే అందులో అత్తమ్మ స్పెషల్ మసాలా వేస్తారని కూడా చెప్పారు. ఇక చేపల పులుసు విషయానికొస్తే.. ఆయన వదిన (చిరంజీవి భార్య సురేఖ) వండిన చేపల పులుసు అంటే ఇష్టం అని చెప్పారు. ఇలా బంధుత్వాల గురించి చెప్పడం వల్లే ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.
ఇక ఈ రిప్లైతోపాటు మరికొన్ని రిప్లైలు కూడా అనా తన స్టోరీస్‌లో పెట్టారు. అలాగే తెలుగు నేర్చుకుంటున్నాను అంటూ కొన్ని ఫొటోలు కూడా షేర్ చేశారు.