కొన్ని కాంబినేషన్‌ల గురించి వింటే అంచనాలు పెరుగుతాయి. మరికొన్ని కాంబినేషన్‌ల గురించి వింటే అంచనాలతో పాటు ఆశ్చర్యమూ కలుగుతుంది. అలాంటి ఓ కాంబినేషన్ గురించి గత కొన్ని నెలలుగా టాలీవుడ్‌లో రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పుడు అధికారికంగా ఆ సినిమాను ప్రకటించేశారు. అయితే ఎప్పుడు, ఎక్కడ, ఎలా అనేది చెప్పలేదు. ఆ విషయం తర్వాత ఆ కాంబో ఏంటి అనేది చెప్పండి అంటారా? ఓకే ఓకే ఆ కాంబినేషనే ‘అడివి శేష్ – సాయి మార్తాండ్’.
ఏంటీ సాయి మార్తాండ్ అంటే ‘లిటిల్ హార్ట్స్’ దర్శకుడు సాయి మార్తాండేనా అనే డౌట్ అడగొద్దు. ఆయనే. యూట్యూబర్ మౌళి తనుజ్ హీరోగా ‘లిటిల్ హార్ట్స్’ సినిమాతో డైరక్టర్‌గా బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న సాయి మార్తాండ్ నెక్స్ట్ మూవీ విషయంలో క్లారిటీ వచ్చేసింది. త్వరలో ‘డెకాయిట్’ అంటూ అలరించబోతున్న అడివి శేష్ హీరోగానే సాయి మార్తాండ్ సినిమా ఉండబోతోందట. ‘డెకాయిట్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఈ విషయాన్ని సాయి మార్తాండ్, శేష్ ఖరారు చేస్తూ ప్రకటించేశారు.
మామూలుగా అయితే ఇద్దరూ భిన్న ధృవాలు. అడివి శేష్ స్టైల్ థ్రిల్లర్, యాక్షన్ జోనర్. సాయి మార్తాండ్ స్టైల్ ఎంటర్‌టైన్మెంట్. ఇలాంటి ఇద్దరూ కలసి సినిమా చేస్తున్నారు అంటూ ఈ రెండింటి కాంబినేషన్ అయినా అయి ఉండాలి. లేదంటే ఒకరి జోనర్‌లోకి మరొకరు రావాలి. మరేం జరుగుతుంది అనేది ఆసక్తికరంగా మారింది. అలాగే ఈ ష్యూర్ షాట్ హిట్ కాంబోకు బడ్జెట్ పెట్టే నిర్మాత ఎవరు అనేది కూడా చూడాలి. ఎందుకంటే శేష్ ఇప్పుడు హాట్ కేక్. ఓకే అంటే డబ్బులు పెట్టే నిర్మాతలు వరుస కడతారు.
ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని.. ‘జీ 2’ సినిమా పనులను శేష్ పూర్తి చేసుకున్నాక కాస్త గ్యాప్ ఇచ్చి సాయి మార్తాండ్ సినిమా స్టార్ట్ చేస్తారని సమాచారం.