రాజకీయాల్లోకి, సినిమాల్లోకి వారసులు రావడం కొత్తేమీ కాదు. గత కొన్నేళ్లుగా ఈ విధానం నడుస్తూనే ఉంది. అయితే రాజకీయాల్లోకి సినిమా వాళ్లు రావడం, సినిమాల్లోకి రాజకీయా నాయకుల వారసులు రావడం అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. ముఖ్యం కన్నడ నాట ఈ రెండో రకం ఎంట్రీలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. సీఎంల తనయులు, మాజీ సీఎంల తనయులు ఇలా వస్తుంటారు. తాజాగా గనుల వ్యాపారి, రాజకీయ నాయకుడు గాలి జనార్దన్ రెడ్డి తనయుడు సినిమా అరంగేట్రం చేస్తున్నారట. అవును గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి సినిమాల్లోకి వస్తున్నారట.
గాలి జనార్దన్ రెడ్డి అంటే కన్నడ నాటే కాదు, తెలుగు నాట కూడా చాలామందికి తెలుసు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు, ఆ తర్వాత కూడా గాలి జనార్దన్ రెడ్డి పేరు తెలుగు నాట మారుమోగిపోయింది. ఆ మధ్య కూతురు వివాహం అంగరంగ వైభవంగా నిర్వహించారు. పెళ్లికార్డు నుండి వేడుక వరకు అన్నీ… అదిరిపోయాయి. అలాంటిది ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి తనయుడు హీరో అవుతున్నాడు అంటే ఆ బడ్జెట్, భారీతనం ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు.
త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడనుందని సమాచారం. కన్నడ దర్శకుడు రాధాకృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది. ఇటీవల ఆయనే ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారట. ప్రస్తుతం కిరీటి డ్యాన్స్, యాక్టింగ్‌లో శిక్షణ తీసుకుంటున్నాడట. దివంగత కన్నడ నటుడు పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ తీసిన ‘జాకీ’ సినిమా స్ఫూర్తితో… కిరీటి సినిమా పరిశ్రమలోకి వస్తున్నట్లు రాధాకృష్ణ తెలిపారు. అంతేకాదు ఈ సినిమా కన్నడతో పాటు తెలుగులోనూ తెరకెక్కనుంది. అయితే ఈ సినిమాకు నిర్మాత గాలి జనార్దన్ రెడ్డి కాదట.
ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి ఈ సినిమా నిర్మిస్తున్నట్లు సమాచారం. భారీ కార్యక్రమం నిర్వహించి కిరీటి శాండిల్ వుడ్ఎంట్రీని అనౌన్స్ చేస్తారట. ఎప్పుడు, ఎక్కడ అనేది కూడా త్వరలోనే తెలియజేస్తారట. ఇప్పటికే మాజీ సీఎం కుమారస్వామి తనయుడు నిఖిల్ కూడా ఇలానే హీరో అయిన విషయం తెలిసిందే.