Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • రాగ్ మ‌యూర్‌ (Hero)
  • మిథిలా పాల్క‌ర్‌ (Heroine)
  • అజ‌య్‌, బ్ర‌హ్మాజీ, రాశీ, ప్రిన్స్‌ త‌దిత‌రులు (Cast)
  • మ‌ల్లిక్ రామ్‌ (Director)
  • రాజీవ్‌, మేఘ‌న‌, స్నేహ రాజేష్‌, విహాన్‌, హ‌రిచంద్‌ (Producer)
  • శ్రీచ‌ర‌ణ్ పాకాల‌ (Music)
  • సునీల్ కుమార్ నామా (Cinematography)
  • ఛోటా కే ప్ర‌సాద్‌ (Editor)
  • Release Date : 25th సెప్టెంబ‌ర్ 2026
  • చిలుక ప్రొడ‌క్ష‌న్స్‌ (Banner)

రాగ్ మ‌యూర్ హీరోగా డీజే టిల్లు ఫేమ్ మ‌ల్లిక్‌రామ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన అనుమాన ప‌క్షి (Anumana Pakshi) మూవీ శుక్ర‌వారం థియేట‌ర్ల‌లో రిలీజైంది. మిథిలా పాల్క‌ర్ హీరోయిన్‌గా న‌టించిన ఈ సినిమాలో అజ‌య్‌, రాశీ, బ్ర‌హ్మాజీ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ప్యార‌డైజ్‌కు పోటీగా రిలీజైన ఈ చిన్న సినిమా ఎలా ఉంది? డీజే టిల్లుతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన మ‌ల్లిక్ రామ్ ఈ సినిమాతోను ఆ మ్యాజిక్‌ను కంటిన్యూ చేశాడా? లేదా? అంటే?

Anumana Pakshi Movie Review

క‌థ‌: స‌న్నీ (రాగ్ మ‌యూర్‌) ఓ యూట్యూబ‌ర్‌. అనుమానాలు ఎక్కువ‌. ఎవ‌రైనా వ‌చ్చి మాట్లాడిన‌, ఫోన్‌కు ఏదైనా మెసేజ్ వ‌చ్చిన డౌట్ ప‌డ‌తాడు. అత‌డి అనుమానాల వ‌ల్ల త‌ల్లిదండ్రుల‌తో పాటు స్నేహితులు ఇబ్బందులు ప‌డుతుంటారు. స‌న్నీ కార‌ణంగా బిజినెస్‌లో లాస్ అయిన ఓ స్నేహితుడు క‌శ్మీర్‌లో జాబ్ చేస్తుంటాడు. త‌న జీవితాన్ని నాశ‌నం చేసిన స‌న్నీపై రివేంజ్ తీర్చుకోవ‌డం కోసం ఆత్మ‌హ‌త్య చేసుకుంటున్నాన‌ని అబ‌ద్దం ఆడి అత‌డిని క‌శ్మీర్ ర‌ప్పిస్తాడు. అక్క‌డే స‌న్నీకి క‌న్య (మిథిలా పాల్క‌ర్‌) ప‌రిచ‌య‌మ‌వుతుంది. స‌న్నీని ప్రేమించిన క‌న్య తండ్రిని ఒప్పించి అత‌డిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటుంది. అదే టైమ్‌లో స‌న్నీతో క‌లిసి క‌శ్మీర్ వ‌చ్చిన అత‌డి స్నేహితుడు వ‌ర్మ (ప్రిన్స్‌) అనుమానాస్ప‌ద రీతిలో చ‌నిపోతాడు. ఆ హ‌త్య చేసింది స‌న్నీనే పోలీస్ ఆఫీస‌ర్ వాసు (అజ‌య్‌) భావిస్తాడు. అస‌లు వాసు క‌శ్మీర్ ఎందుకు వ‌చ్చాడు? స‌న్నీని క‌న్య ఎలా మోసం చేసింది? వ‌ర్మ ఎలా చ‌నిపోయాడు? ఈ మ‌ర్డ‌ర్ కేసు నుంచి స‌న్నీ ఏ విధంగా బ‌య‌ట‌ప‌డ్డాడు అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

న‌టీన‌టుల ప‌నితీరు: అతి అనుమానాల‌తో తాను ఇబ్బందులు ప‌డుతూ జ‌నాల‌ను స‌మ‌స్య‌ల్లోకి నెట్టే యువ‌కుడిగా రాగ్ మ‌యూర్ క‌నిపించాడు. త‌న కామెడీ టైమింగ్‌తో న‌వ్వించే ప్ర‌య‌త్నం చేశాడు. హీరోయిన్ మిథిలా పాల్క‌ర్ రోల్‌ను డీజే టిల్లులో నేహాశెట్టి పాత్ర నుంచి డైరెక్ట‌ర్ ఇన్‌స్పైర్ అయ్యి రాసుకున్నాడు. క్యారెక్ట‌ర్‌కు కావాల్సినంత క‌న్నింగ్‌నెస్‌, గ్లామ‌ర్ ఆమెలో క‌నిపించ‌లేదు. పోలీస్ ఆఫీస‌ర్ వాసుగా అజ‌య్ కామెడీ అస్స‌లు వ‌ర్క‌వుట్ కాలేదు. సీనియ‌ర్ హీరోయిన్ రాశీ అనుభ‌వాన్ని ద‌ర్శ‌కుడు స‌రిగ్గా వాడుకోలేక‌పోయారు. విఫ‌ల ప్రేమికుడిగా ప్రిన్స్, హీరోయిన్ తండ్రిగా బ్ర‌హ్మాజీతో పాటు సినిమాలో చాలా మందే టాలెంటెడ్ ఆర్టిస్ట్‌లు ఉన్నా ఎవ‌రి రోల్ గుర్తుంచుకునేలా ఉండ‌దు.

సాంకేతిక వ‌ర్గం ప‌నితీరు: అనుమాన‌ప‌క్షి (Anumana Pakshi) సినిమా కోసం ద‌ర్శ‌కుడు మ‌ల్లిక్‌రామ్ ఎంచుకున్న క‌థే క‌న్ఫ్యూజింగ్‌గా ఉంది. రాత‌లో ఉన్న గ‌జిబిజి తీత‌లో క‌నిపించింది. సినిమా ఆరంభం నుంచి ముగింపు వ‌ర‌కు అంత గంద‌ర‌గోళంగా అనిపిస్తుంది. ఏ పాత్ర ఎందుకొస్తుంది…తెర‌పై ఏం జ‌రుగుతుంది అన్న‌ది అర్థం కాదు. ల‌వ్‌స్టోరీ, మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ, కామెడీ…అన్ని జాన‌ర్ల‌ను మిక్స్ చేశాడు. దేనిని స‌రిగ్గా ప్ర‌జెంట్ చేయ‌లేక‌పోయాడు. శ్రీచ‌ర‌ణ్ పాకాల పాట‌ల్లో ర‌మ‌ణ గోగుల పాడిన సాంగ్ బాగుంది. క‌శ్మీర్ విజువ‌ల్స్‌ను సినిమాటోగ్రాఫ‌ర్ సునీల్ కుమార్ చాలా క‌ల‌ర్‌ఫుల్‌గా చూపించాడు. అనుమాన‌ప‌క్షి సినిమాకు ప్ల‌స్ పాయింట్ ఏదైనా ఉందా అంటే క‌శ్మీర్ లొకేష‌న్స్ ఒక్క‌టే.

విశ్లేష‌ణ‌: అనుమాన పెనుభూతం అని అంటుంటారు. అతిగా ఆలోచిస్తే అన‌ర్థాలే మిగులుతాయ‌నే పాయింట్ నుంచే ద‌ర్శ‌కుడు మ‌ల్లిక్‌రామ్ అనుమాన‌ప‌క్షి క‌థ‌ను రాసుకున్నారు. ఈ పాయింట్‌కు మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ, ల‌వ్ స్టోరీతో జోడించి ఆద్యంతం ఎంట‌ర్‌టైనింగ్‌గా చెప్పాల‌ని అనుకున్నాడు. కానీ ఈ ప్ర‌య‌త్నంలో పూర్తిగా విఫ‌ల‌మ‌య్యాడు. అత‌డు రాసుకున్న కామెడీ సీన్లు ఒక్క‌టంటే ఒక్క‌డి కూడా న‌వ్వించ‌లేక‌పోయాయి.

హీరో అనుమానాల వ‌ల్ల అత‌డి చుట్టుప‌క్క‌ల వారు ఎలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌నే అంశాల‌తో ఫ‌స్ట్ హాఫ్‌ను న‌డిపించాడు. అవ‌న్నీ క్రింజ్ ఫీలింగ్‌ను క‌లిగిస్తాయి. అనుకోకుండా ఓ మ‌ర్డ‌ర్ కేసులో హీరోచిక్కుకున్న‌ట్లుగా ఇంట‌ర్వెల్‌లో చూపించి సెకండాఫ్‌పై ఇంట్రెస్ట్ క్రియేట్ చేసే ప్ర‌యత్నం చేశారు.

అక్క‌డి నుంచి అయిన డైరెక్ట‌ర్ ట్రాక్‌లో ప‌డ‌తాడ‌ని ఆశించిన ఆడియెన్స్‌కు నిరాశే మిగులుతుంది. రీల్స్ పిచ్చి ఉన్న పోలీస్ ఆఫీస‌ర్‌గా అజ‌య్‌, ద‌య్యాల‌తో మాట్లాడే మ‌హిళ‌గా రాశీ క్యారెక్ట‌ర్ల‌ను ప్ర‌వేశ‌పెట్టి వారితో కామెడీ చేయించ‌డం, డెడ్‌బాడీ ఉన్న రూమ్‌లో నుంచి హీరోను టెర్ర‌రిస్ట్ కిడ్నాప్ చేయ‌డం…ఇలా లాజిక్‌లేని స‌న్నివేశాల‌తో సినిమా ఓపిక‌కు ప‌రీక్ష పెడుతుంది.

సీన్ సీన్‌కు లింక్ లేకుండా….స్క్రీన్‌పై ఏం జ‌రుగుతుందో అర్థం కాకుండా సినిమాను ముగించేశాడు. వ‌ర్మ మ‌ర్డ‌ర్ వెనుక ఏదో ట్విస్ట్ ఉన్న‌ట్లుగా చివ‌రి వ‌ర‌కు దాచాడు. అది సిల్లీగానే అనిపిస్తుంది. హీరోను హీరోయిన్ మోసం చేసే సీన్ నుంచి సింప‌థీ, కామెడీ ఏది పండ‌లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే సినిమాలో మైన‌స్‌లే ఎక్కువ‌గా ఉన్నాయి. గంట యాభై ఒక్క నిమిషాల ర‌న్ టైమ్ ఈ సినిమాకు ప్ల‌స్ పాయింట్‌.

ఫోక‌స్ పాయింట్‌: సినిమా క్లైమాక్స్‌లో అనుమాన‌ప‌క్షికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అనే డైలాగ్ ఉంటుంది. సినిమా చూసిన అది నిజ‌మేన‌ని అనిపిస్తుంది. డౌట్ లేకుండా ఈ సినిమాను స్కిప్ చేసేయ‌చ్చు.

రేటింగ్‌: 1/5

Rating

1
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus