ఇటీవల “భాగమతి” చిత్రంలో అనుష్కను రెండు విభిన్నమైన పాత్రల్లో చూసి షాకైనా తెలుగు ప్రేక్షకులు మరోమారు అనుష్కను చూసి ఇంకాస్త ఎక్కువగా షాక్ అయ్యారు. ఇంతకీ ఎక్కడా అనుకొంటున్నారా? ఒక పెట్రోల్ బంక్ లో. ఏముందిలో తన కారులో పెట్రోల్/డీజిల్ కొట్టించుకోవడం కోసం వచ్చి ఉంటుంది అని మైండ్ లో ఫిక్సైపోతే తప్పులో కాలేసినట్లే. ఇంతకీ అనుష్క అక్కడ ఎందుకుంది అనే విషయం తెలియాలంటే ఈ ఆర్టికల్ ను పూర్తిగా చదవాల్సిందే. మంచు లక్ష్మీ అత్యంత స్పూర్తిదాయకంగా నిర్వహిస్తున్న “మేము సైతం” అనే ప్రోగ్రామ్ గుర్తుంది కదా. జెమిని టీవీలో ప్రసారమైన ఈ షో చాలామందికి సహాయం అందించింది. అందులో మన టాలీవుడ్ స్టార్ హీరోహీరోయిన్లు, నటులు పాల్గొని సామాన్య మానవులకోసం ‘మేము సైతం” అంటూ అండగా నిలిచారు. ఈ షో సెకండ్ సీజన్ త్వరలో ప్రారంభంకానుంది. బ్యాంకింగ్ ఎపిసోడ్స్ షూటింగ్ మొదలైంది.
అందులో భాగంగా ఒక ఎపిసోడ్ కోసం అనుష్క తన వంతుగా పెట్రోల్ బంకులో కొద్ది గంటలు పనిచేసి ఆ డబ్బును మేము సైతం ప్రోగ్రామ్ ద్వారా సహాయమండుకొనేవారికి అందించింది. అయితే.. అనుష్క అమ్మిన పెట్రోల్ ధర వింటే బీజేపీ ప్రభుత్వం కూడా షాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే రోజుకోసారి రేటు పెంచుతూ చాప కింద నీరులా ప్రజల సొమ్ము కొల్లగొడుతున్న ప్రభుత్వం అమ్మే రేటుకి డబుల్ వసూలు చేసింది అనుష్క. అయితే.. అది ప్రజల మంచి కోసం కావడం ముఖ్యంగా స్వీటీతో సరదాగా మాట్లాడి, ఒక సెల్ఫీ కూడా తీసుకొనే సౌలభ్యం కూడా ఉండడంతో జనాలు పెట్రోల్ బంక్ వద్ద భారీస్థాయిలో క్యూ కట్టారు.