మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, ఎన్టీఆర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న “అరవింద సమేత వీర రాఘవ” సినిమా షూటింగ్ వేగంగా సాగుతోంది. పగలు, రాత్రి అనే తేడా లేకుండా చిత్ర బృందం శ్రమిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ ‘పారిస్’ లో జరుగుతోంది. గత వారం మొదలైన ఈ చిన్న షెడ్యూల్ మరో రెండు రోజుల్లో పూర్తికానుంది. అప్పుడే ఇండియాకి తిరిగి వచ్చి ప్రీ రిలీజ్ వేడుకకు సన్నద్ధం కానున్నారు. వాస్తవానికి ఎస్ థమన్ స్వరపరిచిన పాటలను గ్రాండ్ గా రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ పనుల ఒత్తిడి కారణంగా డైరక్ట్ గా మార్కెట్లోకి విడుదల చేశారు. ప్రీ రిలీజ్ వేడుకను వైభవంగా నిర్వహించాలని డిసైడ్ అయ్యారు.
తారక్ జాతకరీత్యా ఈ వేడుకని జరిపేందుకు వచ్చేనెల 2 సరైన సమయం అని చెప్పడంతో అప్పుడే జరపనున్నారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా నందమూరి బాలకృష్ణ హాజరుకానున్నారు. పూజా హెగ్డే, ఈషా రెబ్బా హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా ద్వారా సునీల్ కమెడియన్ గా రీ ఎంట్రీ ఇస్తున్నారు. రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో జగపతిబాబు, నాగబాబు ఇద్దరు రెండు ఫ్యాక్షన్ గ్రూపులకు చెందిన నాయకుల పాత్రల్లో కనిపించబోతున్నారు. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ ఫై రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ మూవీ అక్టోబర్ 11 న సినిమా రిలీజ్ కానుంది. తొలిసారి త్రివిక్రమ్, ఎన్టీఆర్ కాంబినేషన్లో వస్తున్న మూవీ కావడంతో దీనిపై భారీ అంచనాలున్నాయి.