సినిమాల్లో డ్రామా పండించడానికి చాలా సమయం ఉంటుంది. కావాల్సినంత క్యారెక్టెర్స్ ఉంటాయి. అదే టీవీ రియాలిటీ షోల్లో డ్రామా పండించడానికి అంత సమయం ఉండదు. దీంతో అమ్మాయి, అబ్బాయి మధ్య లవ్ ట్రాక్‌ను రన్ చేసి డ్రామా చేస్తున్నారు. ‘జబర్దస్త్’లో ఇలాంటి సీన్లు చాలా చూశాం. తాజాగా ఓంకార్ షో ‘కామెడీ స్టార్స్’లోనూ అదే జరుగుతోంది. గత కొన్ని రోజులు అషు రెడ్డి, హరి మధ్య ఓ ఫేక్ లవ్ ట్రాక్ రన్ చేస్తున్నారు. అయితే ఈ వారం ఆ ట్రాక్ ఛాతి మీద పచ్చబొట్టు పొడిపించుకునేంత వరకు వెళ్లింది.
మొన్నామధ్య వచ్చిన ఈ స్కిట్ ప్రోమో చూసి… చాలామంది ఆ పచ్చబొట్టు నిజం కాదులే… కావాలనే అలా హైప్ క్రియేట్ చేస్తున్నారు అని అనుకున్నారు. అయితే ఎక్కడో చిన్న డౌట్ అయితే ఉంది. అది నిజం పచ్చబొట్టేమో అని. అయితే నిన్న టెలీకాస్ట్ అయిన ఎపిసోడ్ చూస్తే… ఆఖరి వరకు అది నిజం పచ్చబొట్టే అనే అనిపించింది. దీంతో అషు, యాంకర్ వర్షిణి, జడ్జిలు శేఖర్ మాస్టర్, శ్రీదేవి కూడా అదే అనుకున్నారు. కూసింత ఎమోషనల్ కూడా అయ్యారు.
అంతా నిజం… ఇక ఎపిసోడ్ అయిపోయింది అనే సమయంలో ‘ఇది ఫేక్ పచ్చబొట్టు’ అంటూ హరి అసలు సంగతి చెప్పాడు. దీంతో అంతటా నవ్వులు పూశాయి. జబర్దస్త్‌తో పోలిస్తే.. ఈ ట్రాక్ విషయంలో కామెడీ స్టార్స్ ఇంకొంచెం బాగా చేశారనే చెప్పుకోవాలి. అయితే పవన్ కల్యాణ్ పచ్చబొట్టుతో హైలైట్ అయిన… అషు పేరును టాటూగా వేసుకొని హరి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాడు.