దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి మూడేళ్లపాటు దాచి పెట్టుకున్న రహస్యం బయట పడింది. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? అనే విషయం తెలిసిపోయింది. చిత్ర బృందానికి అత్యంత సన్నిహితులు చెప్పిన సమాచారం ప్రకారం… “బాహుబలి(ప్రభాస్) మహిస్మతి రాజ్యానికి రాజు అయినా తర్వాత సామాన్య యువతి అయిన దేవసేన(అనుష్క) ప్రేమలో పడుతాడు. భల్లాల దేవా(రానా) కూడా దేవసేనను పెళ్లాడాలనుకుంటాడు. ఈ విషయం తెలిసిన రాజమాత శివగామి (రమ్య కృష్ణ) దేవసేనను పెళ్లాడేవారు రాజ్యాన్ని వదిలి వెళ్లిపోవాలని ఆదేశిస్తుంది. బాహుబలి రాజ్యాన్ని వదిలిపెట్టి దేవసేనతో వెళ్ళిపోతాడు. భల్లాల దేవ మాహిష్మతి రాజ్యానికి రాజు అవుతాడు.
ఈ సమయంలో కాలకేయ కొడుకు మహిస్మతిపై దండ ఎత్తి వస్తాడు. అది తెలిసి బాహుబలి రాజ్యానికి వచ్చి సైనికుడిలా శత్రువులను చీల్చి చెండాడుతాడు. అతని పోరాట ప్రతిమను చూసి శివగామి మళ్లీ అతనికే పట్టం కడుతుందని భయపడిన భల్లాల దేవా తమ సైన్యానికి అధిపతి అయిన కట్టప్పకు బాహుబలిని చంపమని ఆదేశిస్తాడు. ఇష్టంలేకపోయినా రాజుల మాటను వినాలనే అంశానికి కట్టుబడి బాహుబలిని కట్టప్ప వెనుకనుంచి పొడిచి చంపేస్తాడు.”.. ఎంతో ఎమోషన్ కలిగిన ఈ సన్నివేశాన్ని ఇప్పటివరకు రాజమౌళి చిత్రీకరించలేదు. లీక్ అవుతుందని ఉద్దేశంతో ఆలా చేసాడని తెలిసింది. బాహుబలి కంక్లూజన్ కు కీలకమైన ఈ సీన్ ని రేపటి నుంచి షూట్ చేయనున్నారు. క్లైమాక్స్ షెడ్యూల్ పూర్తి అయిన తర్వాత వారం రోజులుగా రెస్ట్ తీసుకున్న చిత్ర యూనిట్ బుధవారం(సెప్టెంబర్ 7) నుంచి షూటింగ్ లో పాల్గొననుంది. ఇందులో ప్రభాస్, రానా తో పాటు అనుష్క, సత్యరాజ్ తదితరులు పాల్గొననున్నారు.