డూప్ లేకుండా రిస్కీ షాట్ ని అవ‌లీల‌గా చేసిన బాల‌కృష్ణ‌

భారీ మాస్ యాక్ష‌న్, క‌మ‌ర్షియ‌ల్‌ సినిమాల్లో రిస్కీ షాట్స్ ఉంటూనే ఉంటాయి. మ‌రింత రిస్క్ అనిపించిన‌ప్పుడు డూప్‌ల‌ను పెట్టి చిత్రీక‌రిస్తారు. కానీ ఓ అసాధార‌ణ‌మైన షాట్‌ను డూప్‌తో ప‌నిలేకుండా నంద‌మూరి బాల‌కృష్ణ అవ‌లీల‌గా చేసిన తీరు అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌స్తుతం పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. భ‌వ్య క్రియేష‌న్స్ ప‌తాకంపై ఈ చిత్రాన్ని వి.ఆనంద‌ప్ర‌సాద్ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ పోర్చుగ‌ల్‌లో జ‌రుగుతోంది.

ద‌ర్శ‌కుడు పూరి జ‌గ‌న్నాథ్ మాట్లాడుతూ “పోర్చుగ‌ల్ రాజ‌ధాని లిస్బ‌న్ లో ఆదివారం ఓ ఛేజ్ సీన్‌ను తెర‌కెక్కించాం. ఇందులో కార్‌ని డ్రిఫ్టింగ్ ప‌ద్ధ‌తిలో 360 డిగ్రీలు తిప్పే షాట్‌ను చిత్రీక‌రించాం. ఆ షాట్‌ని బాల‌కృష్ణ‌గారు రెండు సార్లు డూప్ లేకుండా చేశారు. కారులో ఆయ‌న ప‌క్క సీట్లో కూర్చున్న శ్రియ అయితే షాక్ అయిపోయింది. పోర్చుగ‌ల్ టెక్నీషియ‌న్లు, మ‌న చిత్ర యూనిట్ అంతా ఆనందంతో గ‌ట్టిగా క్లాప్స్ కొట్టారు. అలా సినిమా మీద బాల‌కృష్ణ‌గారికి ఉన్న ప్యాష‌న్ మ‌రో సారి రుజువైంది. ఆయ‌న క‌మిట్‌మెంట్ చూసి అంద‌రం ఫిదా అయిపోయాం“ అని అన్నారు.
నిర్మాత వి.ఆనంద‌ప్ర‌సాద్ మాట్లాడుతూ “బాల‌య్య‌గారి 101వ చిత్రాన్ని మా సంస్థ‌లో ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందిస్తున్నాం. మా సినిమాకి అన్నీ చాలా చ‌క్క‌గా స‌మ‌కూరుతున్నాయి.

మే 13నుంచి పోర్చుగ‌ల్ షెడ్యూల్‌ను మొద‌లుపెట్టాం. ఈ నెల మూడో వారం వ‌ర‌కూ అక్క‌డే జ‌రుగుతుంది. జూన్ 10న బాల‌కృష్ణ‌గారి పుట్టిన‌రోజును పుర‌స్క‌రించుకుని జూన్ 9 వ తారీఖు రాత్రి బాల‌కృష్ణ‌ గారు, పూరి జ‌గ‌న్నాథ్‌గారు… మా భ‌వ్య క్రియేష‌న్స్ ఫేస్‌బుక్ పేజీలో లైవ్ చేయ‌బోతున్నారు. ఇత‌ర వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తాం. ఇటీవ‌ల బాల‌య్య‌గారు చేసిన ఛేజ్ సీన్‌కు మా యూనిట్ మొత్తం ఆశ్చ‌ర్య‌పోయారు. అభిమానుల‌కు, సినీ ప్రియుల‌కు ఈ సినిమా విందు భోజ‌నంలా ఉంటుంది. బాల‌కృష్ణ‌గారు హీరోగా పూరి జ‌గ‌న్నాథ్‌గారు ద‌ర్శ‌క‌త్వం చేస్తున్నార‌న‌గానే ఎంతో మంచి స్పంద‌న వ‌చ్చింది. ఆ స్పంద‌న‌కు ఏ మాత్రం తీసిపోని విధంగా చిత్రాన్ని రూపొందిస్తున్నాం“ అని చెప్పారు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus