బాలీవుడ్ నటి హేమమాలినికి నందమూరి నటసింహ బాలకృష్ణ అమూల్యమైన కానుకతో ఆశ్చర్య పరిచారు. ప్రస్తుతం బాలయ్య నటిస్తున్న వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి షూటింగ్ మధ్యప్రదేశ్ లో జరుగుతోంది. అక్కడి కోటలలో సన్నివేశాలను దర్శకుడు క్రిష్ షూట్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్ లో బాలకృష్ణ తో పాటు హేమమాలిని, శ్రీయ పాల్గొంటున్నారు. శ్రీయ బాలయ్యకు భార్య గా నటిస్తుండగా, హేమమాలిని అమ్మగా కీలక పాత్ర పోషిస్తోంది.
గతంలో హేమమాలిని మహానటుడు నందమూరి తారక రామారావుతో కలిసి పాండవ వనవాసం.. శ్రీకృష్ణ విజయం చిత్రాల్లో నటించారు. అనేక సంవత్సరాల తర్వాత తెలుగు సినిమాలో కనిపించబోతున్నారు. అది ఎన్టీఆర్ తనయుడి చిత్రంలో కావడం విశేషం. మధ్యప్రదేశ్ షెడ్యూల్ తొలి రోజు షూటింగ్ కి సీనియర్ నటి రాగానే ఆమెకు నందమూరి హీరో లేపాక్షి చీరను అందించారు. ఆ చీర తాను ఎమ్మెల్యేగా ఉన్న హిందూపురం నియోజకవర్గంలోనే నేసినట్లు గా చెప్పడంతో హేమమాలిని చాలా సంతోషించినట్లు తెలిసింది. ఇప్పటికే సగ భాగం చిత్రీకరణ పూర్తి చేసుకున్న గౌతమిపుత్ర శాతకర్ణి సంక్రాంతికి బరిలో దిగనుంది.