నందమూరి బాలకృష్ణ హీరోగా.. కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. మొన్నీ మధ్య ఈ సినిమా ఉండదు అని పుకార్లు వస్తే.. ‘లేదు లేదు.. మా సినిమా ఉంది’ అంటూ ఓ క్లియర్ పోస్ట్ కూడా సినిమా టీమ్ వేసింది. ఇప్పుడు ఈ సినిమా గురించి పుకార్ల షికార్లు పెరిగాయి. తద్వారా సినిమా ఇంకా ప్రీప్రొడక్షన్‌లో ఉంది అనే మేటర్‌ను చెప్పే ప్రయత్నం చేస్తున్నాయి. అలా కొత్తగా వచ్చిన వార్త.. ఈ సినిమాలో హీరోయిన్లు ఎవరు అని?.
అవును.. రీసెంట్ సినిమాల ట్రెండ్ తరహాలోనే బాలకృష్ణ సినిమా కోసం కొరటాల ఇద్దరు హీరోయిన్ల కథనే సిద్ధం చేశారట. అయితే ఇందులో ఓ ట్విస్ట్ ఉంది. ఒక హీరోయిన్ తర్వాత విలన్ అవుతుంది అని చెబుతున్నారు. ఈ రెండు పాత్రల కోసం కొరటాల దాదాపు ఒకే పేరున్న కథానాయికల్ని ఓకే చేస్తున్నారట. వారే ఐశ్వర రాజేష్, ఐశ్వర్య లక్ష్మి. ఈ ఇద్దరు తమిళ హీరోయిన్లతో ప్రస్తుతం టాక్స్ నడుస్తున్నాయట. త్వరలోనే ఫైనల్ డెసిషన్ చెబుతారట.
కొరటాల శివ మార్కు సినిమాల్లో కనిపించే సామాజిక దృక్పథం, కుటుంబ భావోద్వేగాల మేళవింపు ఈ సినిమాలోనూ ఉండబోతోంది అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమా తొలి షూటింగ్ షెడ్యూల్ అక్టోబర్ మొదటి వారం నుండి ప్రారంభిస్తారని సమాచారం. అయితే ప్రారంభ షెడ్యూల్‌లో బాలకృష్ణ పాల్గొనడం లేదని తెలుస్తోంది. ఆయన లేని కొన్ని సన్నివేశాలను ఇందులో తెరకెక్కిస్తారట. ఆ తర్వాత యాక్షన్ సీన్స్ తెరకెక్కిస్తారట. అప్పుడు బాలయ్య అందుబాటులోకి వస్తారట.
ఈ పోరాట సన్నివేశాల కోసం ఇప్పటికే ఓ భారీ సెట్ సిద్ధం చేశారట. అందులో 15 రోజుల పాటు షూటింగ్ జరగనుందని తెలుస్తోంది. దీంతో ప్రధాన యాక్షన్ సీన్స్ అన్నీ అయిపోతాయట. ఇక హీరోయిన్ల విషయం చూస్తే.. ఐశ్వర్య లక్ష్మిని హీరోయిన్‌గా ఖరారు చేశారట. ఐశ్వర్య రాజేష్ ఇందులో లేడీ విలన్‌గా కనిపిస్తుందట. అయితే హీరోయిన్ యాంగిల్ కూడా ఉంటుంది అని చెబుతున్నారు.