ప్రముఖ కథానాయకుడు నందమూరి బాలకృష్ణ – ప్రముఖ దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ముహూర్తం కార్యక్రమం ఈ రోజు ఘనంగా జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లోని వెంకటాయపాలెంలో ఉన్న ప్రసిద్ధ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఈ చిత్ర పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ మంత్రులు నారా లోకేశ్, కందుల దుర్గేశ్ ముఖ్య అథితులుగా హాజరయ్యారు.
ఈ రోజు సినిమా మాత్రమే ప్రారంభిస్తారు.. బాలయ్య – లోకేశ్ కాంబినేషన్ ఫొటోలు చూసి మురిసిపోదాం అని నారా – నందమూరి అభిమానులు, టీడీపీ కార్యకర్తలు, బాలయ్య ఫ్యాన్స్ అనుకుంటే.. సినిమా నిర్మాత అంతకుమించిన అప్‌డేట్‌తో డబుల్, ట్రిపుల్ ఆనందాన్ని ఇచ్చారు. దీంతో అభిమానులు బ్రహ్మానందపడుతున్నారు. ‘NBK 112’గా ప్రచారంలో ఉన్న ఈ సినిమాకు రూ.150 కోట్ల నుంచి రూ.200 కోట్ల భారీ బడ్జెట్ పెడుతున్నామని నిర్మాతల్లో ఒకరైన సుధాకర్ చెరుకూరి వెల్లడించారు.
బాలయ్య సినిమాల బడ్జెట్‌లో ఇదే అత్యధికం అని చెప్పొచ్చు. అంతటి భారీ బడ్జెట్ ఇస్తే కొరటాల శివ ఎలాంటి ఇంపాక్ట్ ఉన్న సినిమాలో తీస్తారో మనకు తెలిసిందే. రీసెంట్‌గా ‘దేవర’ సినిమాకు రూ.600 కోట్లకుపైగా వసూళ్లు వచ్చాయి. అయితే ఆ సినిమాకు సీక్వెల్‌గా చెప్పిన ‘దేవర 2’ ఎందుకో కానీ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఎప్పుడు అవుతుందో తెలియదు. దానికి బదులుగానే ఈ సినిమా చేస్తున్నారని టాక్. ఈ సినిమాను కూడా ‘దేవర’ తరహాలో మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తారట.
పాన్ ఇండియా లెవల్‌లో సినిమాను రిలీజ్ చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. ఈ మేరకు కాస్టింగ్ విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ఇతర భాషల సినిమా పరిశ్రమల నుండి ప్రామినెంట్ యాక్టర్స్‌ను ఎంపిక చేస్తున్నారట. ప్రస్తుతం బాలయ్య తన 111వ సినిమాను గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్నారు. ఈ రెండు సినిమాలను పారలల్‌గా చేయాలని బాలయ్య అనుకుంటున్నారని టాక్.