దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ వేవ్ ను మించి సెకండ్ వేవ్ లో కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. వైరస్ సోకకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నా చాలామంది చిన్నచిన్న పొరపాట్లు చేయడం వల్ల కరోనా పాజిటివ్ నిర్ధారణ అవుతోంది. మరో మూడు రోజుల్లో నటసింహం నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు కాగా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో అభిమానులను దృష్టిలో ఉంచుకుని బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియా వేదికగా బాలయ్య తనను కలవడానికి రావద్దంటూ అభిమానులను కోరారు.
అభిమానులకు తాను సర్వదా విధేయుడినని వైరస్ విలయతాండవం చేస్తున్న సమయంలో అభిమానులు తనను చూడటానికి రావడం అభిలషణీయం కాదని బాలకృష్ణ అన్నారు. అభిమానం వల్లే తాను ఇంతవాడిని అయ్యానని ఒక్క అభిమాని దూరమైనా భరించలేనని బాలకృష్ణ చెప్పుకొచ్చారు. తనకు అభిమానుల అభిమానాన్ని మించిన ఆశీస్సులు లేవని అభిమానుల ఆరోగ్యాన్ని మించిన శుభాకాంక్షలు లేవని బాలయ్య తెలిపారు. అభిమానులు కుటుంబంతో ఆనందంగా గడపడమే జన్మదిన వేడుక అని బాలకృష్ణ అన్నారు. దయచేసి రావద్దని మరీమరీ తెలియజేస్తున్నానని బాలయ్య తెలిపారు.
అసువులు బాసిన అభిమానులు, కార్యకర్తలు, అభాగ్యులకు బాలయ్య నివాళులు అర్పిస్తూ తన పోస్ట్ ను ముగించారు. బాలయ్య అభిమానులను దృష్టిలో ఉంచుకుని చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరోవైపు బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఆయన సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ రానున్నాయని ప్రచారం జరుగుతోంది. కరోనా కేసులు తగ్గిన తరువాత వేగంగా సినిమాలను పూర్తి చేయాలని బాలకృష్ణ భావిస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం బాలయ్య బోయపాటి శ్రీను డైరెక్షన్ లో అఖండ సినిమాలో నటిస్తున్నారు.