మొన్నేప్పుడో చెప్పుకున్నాం గుర్తుందా… నందమూరి బాలకృష్ణ సీరియస్ కనిపిస్తే సూపర్ ఉంటాడని. అందులోనూ ఆ పాత్ర ఫ్యాక్షనిస్ట్ అయితే ఇంకా సూపర్ ఉంటాడు. బాలకృష్ణ ఫ్యాక్షన్ బేస్డ్ సినిమాలు పెద్ద లక్ ఫ్యాక్టర్ అనే చెప్పాలి. ఆ నేపథ్యంలో చేసిని సినిమాలు ఎక్కువ శాతం భారీ విజయాలు అందుకున్నాయి. ‘సమరసింహారెడ్డి’, ‘నరసింహనాయుడు’ ఎంతటి విజయాలు అందుకున్నాయో తెలిసిందే. అయితే బాలకృష్ణను అలాంటి పాత్రలో చూసి చాలా రోజులైంది. అయితే త్వరలోనే బాలయ్యను అలా చూడొచ్చని తెలుస్తోంది.
ఫ్యాక్షనిజం నేపథ్యంలో బాలయ్య సినిమా చేసి సుమారు 20 సంవత్సరాలు అవుతోంది. ‘చెన్నకేశవరెడ్డి’లో ఆఖరిసారిగా ఆయనలా కనిపించారు. ఇప్పుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలో బాలయ్య మరోసారి ఫ్యాక్షనిస్ట్ అవుతారట. ఇప్పటికే గోపీచంద్ ఈ సినిమాకు సంబంధించి కథ, పాత్ర చిత్రణల విషయంలో వర్క్ చేస్తున్నారు. అయితే తొలుత ఒంగోలు నేపథ్యంలో సినిమా ఉంటుందని వార్తలొచ్చాయి. కానీ ఇప్పుడు సీమ సినిమా అంటున్నారు. ఈ సినిమాకు సంబంధించి కొన్ని ఆసక్తికరమైన అంశాలు బయటికొస్తున్నాయి.
ఇందులో బాలకృష్ణ డ్యూయల్ రోల్లో కనిపిస్తారట. ఒకటి ఫ్యాక్షనిస్ట్ అయితే, రెండోది పోలీసు. తండ్రి ఫ్యాక్షనిస్ట్‌గా కనిపించడం, కొడుకు పోలీసుగా కనిపించడం కొత్తేమీ కాదు. ఆఖరిసారిగా ‘చెన్నకేశవరెడ్డి’ సినిమాలోనూ బాలయ్య ఇలానే కనిపించాడు. మరి ఇప్పుడు అంతకుమించి కొత్తగా గోపీచంద్ మలినేని ఏం చూపిస్తాడనేది చూడాలి. గోపీచంద్ సినిమాలో యాక్షన్, కామెడీ రెండూ మిక్స్ అయి ఉంటాయనే విషయం మనకు తెలిసిందే.