Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • సందీప్ స‌రోజ్‌ (Hero)
  • కేయూరి షా (Heroine)
  • కృష్ణుడు, కేదార్ శంక‌ర్‌, రిత్విక్‌, య‌శోర త‌దిత‌రులు (Cast)
  • ప్ర‌తాప్ కొల్లారెడ్డి (Director)
  • సుప్రియా యార్ల‌గ‌డ్డ‌ (Producer)
  • క‌ళ్యాణ్ నాయ‌క్‌ (Music)
  • రెహాన్ షేక్ (Cinematography)
  • నరేష్ అడుపా, బొంతల నాగేశ్వర్ రెడ్డి (Editor)
  • Release Date : 6th నవంబర్ 2026
  • అన్న‌పూర్ణ స్టూడియోస్‌ (Banner)

భారీ బ‌డ్జెట్‌తో కూడిన పాన్ ఇండియ‌న్ సినిమాల‌ను నిర్మిస్తూనే మ‌రోవైపు కొత్త న‌టుల‌తో క‌థాబ‌ల‌మున్న చిన్నసినిమాలు చేసి ఎన్నో విజ‌యాల‌ను అందుకుంది అన్న‌పూర్ణ స్టూడియోస్‌. ఈ బ్యాన‌ర్‌లో వ‌చ్చిన మ‌రో లో బ‌డ్జెట్‌ మూవీ “బాలు గీత‌”. క‌మిటీ కుర్రాళ్లు ఫేమ్ సందీప్ స‌రోజ్‌, కేయూరి షా హీరోహీరోయిన్లుగా న‌టించిన ఈ సినిమాకు ప్ర‌తాప్ కొల్లారెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. సుప్రియ యార్ల‌గ‌డ్డ నిర్మించారు. థియేట‌ర్ల‌లో కాకుండా నేరుగా ఈటీవీ విన్ ఓటీటీ ద్వారా బాలు గీత మూవీ తెలుగు ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ఈ చిన్న సినిమా ఎలా ఉందంటే?

Balu Geetha Movie Review

క‌థ‌: బాలు (సందీప్ స‌రోజ్‌) సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌. శృతిని ప్రేమిస్తాడు. బాలును కాద‌ని సందీప్‌ను శృతి పెళ్లిచేసుకుంటుంది. ఆ బ్రేక‌ప్ కార‌ణంగా అమ్మాయిల‌కు దూరంగా ఉండాల‌ని బాలు ఫిక్స‌వుతాడు. బాలుకు పెళ్లి చేయాల‌ని అత‌డి త‌ల్లిదండ్రులు ప్ర‌య‌త్నాలు మొద‌లుపెడ‌తారు. గీత (కేయూరి షా) అనే అమ్మాయితో పెళ్లిచూపులు ఏర్పాటుచేస్తారు. ఆ పెళ్లిచూపులు చెడ‌గొట్టాల‌ని నిర్ణ‌యించుకున్న బాలు…ముందుగానే వెళ్లి గీత‌ను క‌లిసి పెళ్లి త‌న‌కు ఇష్టం లేద‌ని చెప్పాల‌నుకుంటాడు. కానీ గీత మంచి మ‌న‌సు, ఆలోచ‌నావిధానం న‌చ్చి ఇష్ట‌ప‌డ‌తాడు. ఆమెను పెళ్లిచేసుకుంటాడు.

అనుకోకుండా అప‌రిచిత నంబ‌ర్ నుంచి గీత‌కు వ‌చ్చిన వాయిస్ మెసేజ్ బాలు వింటాడు. ఆమెను అపార్థం చేసుకుంటాడు. ఆ మెసేజ్ కార‌ణంగా ఇద్ద‌రి మ‌ధ్య గొడ‌వ‌లు మొద‌వుతాయి. అదే టైమ్‌లో బాలు ప్రేమించిన శృతి ఆమె భ‌ర్త సందీప్‌తో గీత‌కు ప‌రిచ‌య‌ముంద‌నే నిజం బ‌య‌ట‌ప‌డుతుంది. గీత‌ను అనుమానించేంత‌గా ఆ మెసేజ్‌లో ఏముంది? ప‌దో త‌ర‌గ‌తిలో గీత ప్రేమించిన ప్ర‌వీణ్ ఎవ‌రు? గీత‌కు ప్ర‌వీణ్ రాసిన ఓ లెట‌ర్‌తో బాలు ఎలాంటి సంబంధం ఉంది? త‌న త‌ప్పును సందీప్ ఎలా తెలుసుకున్నాడు? అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

న‌టీన‌టుల ప‌నితీరు: టైటిల్‌కు త‌గ్గ‌ట్లే బాలు, గీత అనే పాత్ర‌ల చుట్టే ఈ క‌థ సాగుతుంది. ఈ రోల్స్‌కు సందీప్ స‌రోజ్‌, కేయూరి షా న్యాయం చేశారు. ప‌క్కంటి కుర్రాడి త‌ర‌హా పాత్ర‌లో నాచుర‌ల్ యాక్టింగ్ క‌న‌బ‌రిచాడు సందీప్ స‌రోజ్‌. కేయూరి షా ఎక్కువ‌గా ఎక్స్‌ప్రెష‌న్స్‌తోనే న‌ట‌న‌ను ప‌లికించింది. ఇద్ద‌రి జోడీ బాగుంది. చాలా రోజుల త‌ర్వాత బిగ్‌బాస్ ఫేమ్ కృష్ణుడు ఈ సినిమాలో క‌నిపించాడు. కానీ అత‌డి క్యారెక్ట‌ర్‌ను ద‌ర్శ‌కుడు స‌రిగ్గా వాడుకోలేదు. కేదార్ శంక‌ర్‌, రిత్విక్‌, య‌శోర‌తో పాటు మిగిలిన వారి యాక్టింగ్ ఒకే. త‌మ ప‌రిధుల మేర మెప్పించారు.

సాంకేతిక నిపుణుల ప‌నితీరు: మైండ్‌కు ప‌దును పెట్టే ట్విస్ట్‌లు, ట‌ర్న్‌లు లేకుండా సింపుల్ పాయింట్‌తో ద‌ర్శ‌కుడు ప్ర‌తాప్ కొల్లారెడ్డి ఈ క‌థ‌ను రాసుకున్నారు. కొన్నిసార్లు అపోహ‌లు, అనుమానాలు ఎలాంటి ప‌రిణామాల‌కు దారితీస్తాయి? వైవాహిక బంధాల్లో ఏ విధ‌మైన‌ క‌ల‌త‌లు రేపుతాయ‌నే మెసేజ్‌కు ల‌వ్‌స్టోరీని జోడించి ఈ మూవీని తెర‌కెక్కించారు. బ్రేక‌ప్ త‌ర్వాత కూడా లైఫ్ ఉంటుంద‌ని చూపించారు. క‌థ మంచిదే కానీ చెప్పిన విధానంలోనే లోపాలు ఉన్నాయి. ఇర‌వై నిమిషాల్లో ముగిసిపోయే క‌థ‌ను రెండు గంట‌లు సాగ‌దీయడంతో సినిమా బోర్ ఫీలింగ్‌ను క‌లిగిస్తుంది.

ఈ చిన్న సినిమానే అయినా రెహాన్ షేక్ విజువ‌ల్స్‌, క‌ళ్యాణ్ నాయ‌క్ మ్యూజిక్ వ‌ల్ల ఆ ఫీల్ క‌ల‌గ‌లేదు. బీజీఎమ్‌, మెలోడీ ప్ర‌ధానంగా సాగే పాట‌లు బాగున్నాయి. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై సుప్రియ యార్ల‌గ‌డ్డ ఈ సినిమాను నిర్మించారు. పెద్ద ప్రొడ‌క్ష‌న్ హౌజ్‌కు త‌గ్గ‌ట్లే ప్రొడ‌క్ష‌న్ వాల్యూస్ ఉన్నాయి.

విశ్లేష‌ణ‌: బాలు గీత సినిమా చూస్తుంటే శేఖ‌ర్ క‌మ్ముల మూవీస్‌తో పాటు మ‌ళ్లీరావా, కేరాప్ కంచెర‌పాలెం లాంటి సినిమాలు గుర్తొస్తాయి.ద‌ర్శ‌కుడి రాత‌లోనే కాదు తీత‌లో శేఖ‌ర్ క‌మ్ముల స్టైల్ చాలా క‌నిపించింది. క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్ల కంటే ఎమోష‌న్స్ ప్ర‌ధానంగానే క‌థ‌ను న‌డిపించాల‌ని అనుకున్నారు. కానీ అందులో పూర్తిగా స‌క్సెస్ కాలేక‌పోయారు.

క్లైమాక్స్‌లో వ‌చ్చే కొన్ని ట్విస్ట్‌ల‌పైనే ద‌ర్శ‌కుడు ఎక్కువ‌గా ఆధార‌ప‌డ్డాడు. కానీ అవే తేలిపోయాయి. పెళ్లిచేసుకొని ఏడాది కాపురం చేసిన భార్యాభ‌ర్త‌ల‌కు తాము క‌లిసి చ‌దువుకుంది ఒకే స్కూల్ అని తెలియ‌క‌పోవ‌డం లాజిక్‌లెస్‌గా అనిపిస్తుంది. వారు విడిపోయే కార‌ణం బ‌లంగా లేదు…క‌లిసిపోయే సీన్ల‌ను ఆస‌క్తిగా చెప్ప‌లేక‌పోయారు. ఓ వైపు ప్ర‌జెంట్ స్టోరీని చూపిస్తూనే ఫ్లాష్‌బ్యాక్‌లో స్కూల్ ల‌వ్ స్టోరీని న‌డిపిస్తాడు. చివ‌ర‌లో ఓ ట్విస్ట్‌తో రెండింటిని క‌లిపాడు.

ఇలాంటి క‌థ‌ల‌ను బోర్ కొట్ట‌కుండా చెప్పాలంటే అంత‌ర్లీనంగా ఫ‌న్ జ‌న‌రేట్ అయ్యేలా సీన్లు రాసుకోవాలి. అదే ఈ సినిమాకు లోప‌మైంది. బాలు, గీత ల‌వ్‌స్టోరీ కూడా ముందుకు సాగుతూనే ఉంటుంది కానీ ఏదో మిస్స‌యిన ఫీలింగ్ చివ‌రి వ‌ర‌కు క‌నిపిస్తుంది.

క‌థ‌లోని లోపాల‌ను చాలా వ‌ర‌కు సందీప్ స‌రోజ్‌, కేయూరి షా త‌మ న‌ట‌న‌తో క‌వ‌ర్ చేసేందుకు ప్ర‌య‌త్నించారు. కానీ వారి అనుభ‌వం, క‌ష్టం రెండు స‌రిపోలేదు. అన్న‌పూర్ణ బ్యాన‌ర్ నుంచి వ‌చ్చిన సినిమా అన‌గానే భారీ అంచ‌నాల‌తో చూస్తే డిస‌పాయింట్ చేస్తుంది. బోల్డ్ సీన్లు, డ‌బుల్ మీనింగ్‌ డైలాగ్స్ లేకుండా చాలా క్లీన్‌గా తెర‌కెక్కించ‌డం ప్ల‌స్ పాయింట్‌.

ఫోక‌స్ పాయింట్‌: స్లోగా సాగే రొమాంటిక్ ల‌వ్‌స్టోరీ.

రేటింగ్: 2/5

Rating

2
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus