డిజాస్టర్ అన్నయకు.. బ్లాక్ బస్టర్ తమ్ముడు అవుతాడా?

‘అల్లుడు శీను’ ‘స్పీడున్నోడు’ ‘జయ జానకి నాయకా’ ‘సాక్ష్యం’ ‘కవచం’ దాదాపు అరడజను చిత్రాలు పూర్తవుతున్నప్పటికీ .. ఒక్కటంటే ఒక్క హిట్ కూడా సాధించలేక పోయాడు ‘బెల్లంకొండ సాయి శ్రీనివాస్’ . అయినప్పటికీ ఒక్క హిట్టు కోసం వరుస పెట్టి సినిమాలు చేస్తూ పోతున్నాడు. ఒక పెద్ద హీరోయిన్, ఒక పెద్ద దర్శకుడు , ఒక పేరున్న సంస్థ , ఒక పెద్ద విలన్, భారీ బడ్జెట్ అన్నీ భారీగానే ఉంటాయి కానీ అసలు కథ, ఉండాల్సిన నటన వీటి పై మాత్రం సాయి శ్రీనివాస్ శ్రద్ద పెట్టడు. ప్రస్తుతం తేజ దర్శకత్వంలో చేస్తున్న చిత్రంపైనే ఆశలన్నీ పెట్టుకున్నాడు బెల్లంకొండ. ఇక తన పరిస్థితే ఇలా ఉంటే.. శీను తమ్ముడు బెల్లంకొండ గణేష్ కూడా హీరోగా ఇంట్రడ్యూస్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాడంట.

బెల్లంకొండ సురేష్ రెండో కుమారుడు గణేష్ ఇప్పటివరకూ తన తండ్రి నిర్మిస్తున్న చిత్ర వ్యవహారాలను చూసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు గణేష్ ను హీరోగా పరిచయం చేయడానికి రంగం సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఫణి అనే కొత్త డైరెక్టర్ ను పరిచయం చేస్తూ ఈ చిత్రం రూపొందనుందంట. ఈ చిత్రాన్ని డిసెంబర్ 24న ప్రారంభించబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో సాయి శ్రీనివాస్ కు లాగా పెద్ద హీరోయిన్ ను తీసుకుంటారా లేక చిన్న హీరోయిన్ లేదా కొత్త హీర్లోయిన్ ను తీసుకుంటారా అనే వివరాలు తెలియాల్సి ఉంది. అన్నయ్య శ్రీనివాస్ ఇంకా సక్సెస్ కాకుండానే గణేష్ ను రంగంలోకి దింపడం కొంత ఆశ్చర్యం కలిగించే విషయమే. అయితే ఇలా అన్నయ్యలు సక్సెస్ అవ్వనప్పుడు తమ్ముళ్ళు రంగంలోకి దిగడం కొత్తేమీ కాదు. సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ సక్సెస్ కాకపోవడంతో మహేష్ ను దించారు, ఈ.వి.వి. సత్యనారాయణ పెద్ద కుమారుడు ఆర్యన్ రాజేష్ సక్సెస్ కాకపోవడంతో అల్లరి నరేష్ ను దించారు. చిరంజీవి సహోదరుడు నాగేంద్ర బాబు సక్సెస్ కాకపోవడంతో పవన్ కళ్యాణ్ ఇంట్రడ్యూస్ అయ్యి పవర్ స్టార్ గా ఎదిగాడు. మరి ఈ కోవలో బెల్లంకొండ గణేష్ కూడా సక్సెస్ అవుతాడేమో చూడాలి మరి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus