‘బిచ్చగాడు’ తీసుకొస్తున్న ‘పిల్ల రాక్షసి’

  • September 14, 2016 / 07:36 AM IST

ఈ ఏడాది విడుదలైన అనువాద సినిమాల్లో ‘బిచ్చగాడు’ని మించిన మరో హిట్ లేదని చెప్పాలి. సూర్య, విక్రమ్ లాంటి హీరోల స్థాయిలో కోట్లకు కోట్లు కలెక్షన్లు వచ్చిపడ్డాయి. తెలుగు స్టార్ హీరోల సినిమాలకి ధీటుగా ఆడిన ఈ సినిమాని ఓ రకంగా అనువాద సినిమాల ‘బాహుబలి’గా చెప్పవచ్చు. స్టార్ హీరోలతో నిమిత్తం లేకుండా కథ, ఎమోషన్ తో సినిమా వస్తే విజయం దానంతట అదే వస్తుంది అని ఈ సినిమాతో మరోసారి నిరూపితం అయ్యింది. ‘బిచ్చగాడు’ ఇచ్చిన వసూళ్లు, నమ్మకంతో మరో సినిమాని తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు చదలవాడ పద్మావతి.

‘ఆన్‌ మరియ కలిప్పిలాను’ పేరుతో తెరకెక్కిన మలయాళ చిత్రాన్ని తెలుగులో ‘పిల్ల రాక్షసి’ పేరుతో విడుదల చేయనున్నారు. మిథున్ మాన్యుల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ‘నాన్న’, ‘దాగుడుమూతలా దండాకోర్’ సినిమాల్లో అలరించిన బాలనటి సారా అర్జున్ ప్రధాన పాత్ర పోషించగా, సన్ని వాయ్‌నే, అజు వర్గీస్‌ ఇతర కీలక పాత్రధారులు. ప్రముఖ మలయాళ నటుడు దుల్కర్‌ సల్మాన్‌ అతిథి పాత్రలో కనిపిస్తారు. “ఓ పాఠశాల విద్యార్థినితో ఓ మోసగాడు చేసే సావాసం వల్ల ఏర్పడిన పరిణామాలతో” రూపొందిన ఈ సినిమా మలయాళంలో విజయం సాధించింది. ‘బిచ్చగాడు’కి పనిచేసిన భాషాశ్రీ ఈ చిత్రానికీ మాటలు, పాటలు అందిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus