పెద్ద బరువు దించినట్టే

“నా గురించి మీకో రహస్యం చెప్పనా.. రోడ్డు మీద నేను బయట నడుచుకుంటూ వెళ్తే ఎవ్వరూ గుర్తుపట్టరు. తెరపై కీర్తికీ, తెరవెనుక కీర్తికీ చాలా తేడా ఉంటుంద”ని చెబుతోంది కీర్తి సురేష్. ‘నేను శైలజ’తో తెలుగుతెరకు పరిచయమైందీ మలయాళీ ముద్దుగుమ్మ. సీనియర్ నరేష్ తనయుడి తొలిచిత్రం ‘ఐనా ఇష్టం నవ్వు’లోనూ ఈ అమ్మాయే కథానాయిక. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఇప్పటివరకూ కీర్తి నటించిన ఎనిమిది చిత్రాలు విడుదలయ్యాయి.

చేతిలో మరో ఐదు చిత్రాలున్నాయి. మిమ్మల్ని ఎందుకు గుర్తుపట్టడం లేదు? అని ప్రశ్నిస్తే.. “బయటికి వెళ్లేటప్పుడు మేకప్‌, లిప్‌ స్టిక్‌, ఐ లైనర్స్‌ వంటివి ఏవీ వేసుకోను. సాధారణ అమ్మాయిలా వెళ్తా. ముఖంపై మేకప్‌ లేకుంటే ఏదో పెద్ద బరువు దించినట్టే ఉంటుంది తెల్సా. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా చుట్టూ ఉన్నవారితో త్వరగా కలిసిపోతాను. చాలా స్నేహంగా మెలుగుతా. ఎవరేమన్నా అంత తొందరగా స్పందించను” అంటోంది కీర్తి సురేష్. కథానాయిక అంటే డిజైనర్ దుస్తులు, ముత్యంలా కనిపించే మేకప్, అందమైన నగలు కంపల్సరీ. కానీ, ఎప్పుడూ అవి వేసుకోవడం వారికీ ఇబ్బందిగా ఉంటుంది. రోడ్డు మీద బైక్ తీసుకుని షికారు చేయాలనీ.. ధియేటర్లలో చిత్రాలు చూడాలనీ.. తారలకు మాత్రం ఉండదా చెప్పండి! అభిమానులు చుట్టుముడతారనే భయంతో రారు. కీర్తికి అటువంటి భయాలు లేవనమాట!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus