తమిళ నటి, బిగ్ బాస్ ఫేమ్ మీరా మిథున్ తరచూ వివాదాస్పద కామెంట్స్ తో వార్తల్లో నిలుస్తుంటుంది. ఈ మధ్యకాలంలో ఆమె షెడ్యూల్డ్ కులాలకు చెందిన దర్శకులను, నటీనటులను ఉద్దేశిస్తూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇండస్ట్రీలో ఉన్న దళితులను బయటకు తరిమేయాలని.. వారి కారణంగానే క్వాలిటీ సినిమాలు రావడం లేదని సంచలన వ్యాఖ్యలు చేసింది. దీంతో ఆమెపై ఎస్సీ, ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు.
ఆమెని అరెస్ట్ చేయడం ఖాయమని మాటలు వినిపించగానే.. ఏకంగా పోలీసులకు సవాలు విసిరింది మీరా మిథున్. తనను అరెస్ట్ చేయడమంటే అంత ఈజీ కాదని.. పోలీసులకు దమ్ముంటే అరెస్ట్ చేయాలని ట్విట్టర్ లో పోస్ట్ లు పెట్టింది. తనను అరెస్ట్ చేయడం జరిగే పని కాదని.. ఒకవేళ అది జరిగినా కలలోనే సాధ్యమని పేర్కొంది. ఇన్ని మాటలు చెప్పిన మీరా మిథున్ ఎవరికీ కనిపించకుండా పారిపోయింది. ఆమె కోసం వెతుకులాట మొదలుపెట్టిన పోలీసులు కేరళలో ఆమెని అరెస్ట్ చేశారు.
ఆ తరువాత చెన్నైకి తీసుకొచ్చి రిమాండ్ కి తరలించారు. తాజాగా కోర్టు ఆమెకి షాకిచ్చింది. తనకు బెయిల్ ఇవ్వాలంటూ మీరా మిథున్ పిటిషన్ దాఖలు చేసింది. ఆమె స్నేహితుడు అభిషేక్ సైతం పిటిషన్ దాఖలు చేశారు. వీటిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ఆమె బెయిల్ కు నిరాకరించింది. దీంతో ఆమె మరికొన్ని రోజులు జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి కలిగింది. తదుపరి విచారణ జరిగే వరకు మీరా మిథున్ కి ఈ తిప్పలు తప్పేలా లేవు!