టాలీవుడ్లో గత కొద్ది రోజులుగా మెగా ఫ్యామిలీ వర్సెస్ రోజా అనే చర్చ జరుగుతోంది. రాజకీయాల్లో మెగా ఫ్యామిలీ చేసిందేం లేదు అంటూ.. ఆ మధ్య రోజా పరుషంగా విమర్శించారు. దానికి హర్ట్ అయిన మెగా ఫ్యాన్స్ ఆమెను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలో మెగా బ్రదర్ నాగబాబు ఎంట్రీ ఇచ్చారు. దీంతో పరస్థితి ముదిరి పాకాన పడింది. అయితే హఠాత్తుగా ఈ విషయంలోకి సీనియర్ నటుడు బ్రహ్మాజీ వచ్చి చేరారు.
సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న విషయాలను సోషల్ మీడియాలోనే తిరిగి వాడి వైరల్ అవుతుంటారు బ్రహ్మాజీ. ఈ క్రమంలో మాట్లాడారో, లేక మెగా కుటుంబం మీద అభిమానంతో మాట్లాడారో కానీ.. మాట్లాడి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతోపాటు, మాటలు కూడా పడుతున్నారు. అయితే ఆయన రోజా గురించి చేసిన కామెంట్ మాత్రం మెగా ఫ్యాన్స్‌కు బాగా నచ్చేసింది అని చెప్పాలి. మొన్నామధ్య మెగా బ్రదర్ నాగబాబు.. రోజా గురించి రియాక్ట్ అయ్యారు.
ఓ వీడియోను విడుదల చేసి మరీ మాట్లాడారు. రోజా గురించి, ఆమె రాజకీయ జీవితం గురించి, మంత్రిత్వ శాఖ గురించి.. ఇలా చాలా విషయాల గురించి విమర్శించారు. ఆ తర్వాత ఒకరిద్దరు టాలీవుడ్ నటులు కూడా ఈ విషయంలో స్పందించారు. దాని గురించి రోజా ఇటీవల మాట్లాడుతూ ‘‘మెగా ఫ్యామిలీలో ఆరేడుగురు హీరోలున్నారు. వారికి సపోర్ట్ చేయకపోతే అవకాశాలు రావని వారి భయం’’ అంటూ స్పందించారు. దాంతోపాటు ‘‘అవకాశాలు రావనే చిన్న ఆర్టిస్టులు మెగా ఫ్యామిలీని సపోర్ట్ చేస్తారు.
అంతేకానీ అభిమానంతో కాదు. ఒకవేళ అంత అభిమానమే ఉంటే.. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో చిరంజీవి సపోర్టు చేసిన ప్రకాశ్ రాజ్ ప్యానల్ ఎందుకు ఓడిపోయినట్టు మీ ఆలోచించండి అంటూ లాజిక్ లాగారు. అందుకే నేను చిన్న ఆర్టిస్టులను తిట్టాలనుకోవడం లేదు అని కూడా చెప్పారు. తాజాగా దీనిపై బ్రహ్మాజీ స్పందించారు. ‘‘మెగా ఫ్యామిలీ క్యాంపెయిన్ చేయమని, పార్టీలో చేరమని ఎప్పుడూ అడగలేదు. చిన్న ఆర్టిస్టులే కదా.. అంత భయపడతారెందుకు’’ అని రోజా మాట్లాడిన వీడియోను రీట్వీట్ చేస్తూ రాసుకొచ్చారు.