Bunny Vasu : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ సమస్యలపై బన్నీవాస్ ట్వీట్ వైరల్.. సమస్యపై ఫోకస్ పెడితే బాగుంటుంది !

Advertisement

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలపై నిర్మాత బన్నీవాస్ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీస్తుంది. థియేటర్లకు ప్రేక్షకులు తగ్గిపోవడం, చిన్న సినిమాల పరిస్థితి, ఓటీటీ ప్రభావం వంటి అంశాలపై ఆయన చేసిన విశ్లేషణకు సినీ వర్గాల్లో మిశ్రమ స్పందన కనిపిస్తోంది. తాజాగా చేసిన సోషల్ మీడియా పోస్టులో, సినిమాల కలెక్షన్లు సంఖ్యల్లో భారీగా కనిపిస్తున్నప్పటికీ, వాస్తవానికి ప్రేక్షకుల సంఖ్య పెరగలేదని ఆయన అభిప్రాయపడ్డారు. టికెట్ ధరలు, ఇతర ఖర్చులు పెరగడం వల్లే వసూళ్లు ఎక్కువగా కనిపిస్తున్నాయని, కానీ సాధారణ ప్రేక్షకుడు మాత్రం థియేటర్‌కు రావడం తగ్గిపోయిందని పేర్కొన్నారు.

Bunny Vasu

ముఖ్యంగా చిన్న సినిమాల పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారిందని ఆయన వ్యాఖ్యానించారు. నిర్మాతలు, సింగిల్ స్క్రీన్ థియేటర్ యజమానులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పిన ఆయన, అసలు సమస్యను పక్కనపెట్టి ఆదాయ పంపకాలపై మాత్రమే చర్చలు జరగడం వల్ల ప్రయోజనం ఉండదని అభిప్రాయపడ్డారు.

ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలుగా ఆయన కొన్ని అంశాలను ప్రస్తావించారు. స్టార్ హీరోలు ఒక సినిమా పూర్తి చేయడానికి ఎక్కువ సమయం తీసుకోవడం వల్ల ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గుతుందని తెలిపారు. అలాగే సినిమా విడుదలైన కొద్ది రోజులకే ఓటీటీలో అందుబాటులోకి రావడం కూడా థియేటర్ బిజినెస్‌పై ప్రభావం చూపుతోందన్నారు.

ఇంకా, థియేటర్లలో అధిక క్యాంటీన్ ధరలు, ప్రేక్షకులను బలంగా ఆకట్టుకునే కంటెంట్ కొరత వంటి అంశాలు కూడా పరిస్థితిని మరింత కష్టతరం చేస్తున్నాయని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ప్రేక్షకుడు “థియేటర్‌కు వెళ్లాల్సిన అవసరం ఉందా?” అని ఆలోచించే పరిస్థితి రావడం ఇండస్ట్రీకి ప్రమాద సంకేతమని సూచించారు. మొత్తానికి, బన్నీవాస్ చేసిన ఈ వ్యాఖ్యలు టాలీవుడ్ భవిష్యత్తుపై కీలక చర్చకు తెరతీశాయి. ప్రస్తుతం ఈ అంశాలపై సినీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతోంది.

The Paradise: ‘ది పారడైజ్’.. రీషూట్లే రీషూట్లు.. టీమ్ క్లారిటీ ఇది

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus