సౌత్ సినిమాల హవా హిందీ బాక్సాఫీస్ పై స్పష్టంగా కనిపిస్తోంది. ‘బాహుబలి’ (Baahubali) ఫ్రాంచైజీ తర్వాత పాన్ ఇండియా సినిమాలకు వచ్చిన ఆదరణ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా స్టార్ హీరోల చిత్రాలు మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించడంలో ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. ఇప్పుడు అలాంటి అంచనాలతో విడుదలవుతున్న మరో చిత్రం ‘పుష్ప 2’(Pushpa 2: The Rule) . డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదలవుతున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
‘పుష్ప 2’కు గల ఈ క్రేజ్ కారణం మొదటి భాగం సృష్టించిన మేజిక్. ‘పుష్ప: ది రైజ్’ (Pushpa) నార్త్ ఇండియాలో అనూహ్యంగా మంచి వసూళ్లు సాధించి, రూ. 100 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. అందుకే, సీక్వెల్ మీద భారీ అంచనాలు ఉన్నాయి. నార్త్ బెల్ట్‌లో ఈ సినిమా భారీ స్థాయిలో విడుదలకానుండగా, షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) ‘జవాన్’ (Jawan) ఫస్ట్ డే రికార్డును పుష్ప 2 బ్రేక్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
హిందీ బాక్సాఫీస్ ఫస్ట్ డే రికార్డుల లిస్టు చూస్తే, జవాన్ 63.90 కోట్లతో టాప్‌లో ఉంది. తరువాతి స్థానాల్లో ‘పఠాన్’ 55.70 కోట్లు, ‘స్త్రీ 2’ (Stree 2) 53.25 కోట్లు, మరియు ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ (KGF 2) 52.40 కోట్లు ఉన్నాయి. ‘పుష్ప 2’ ఈ లిస్టులో చేరడం ఖాయం. కానీ, టాప్ పొజిషన్ దక్కించుకుంటుందా అనేది ఆసక్తికరంగా మారింది. పుష్ప 2 మొదటి రోజు రికార్డును క్రాస్ చేసి, భారతీయ చలనచిత్రంలో గేమ్ చేంజర్‌గా నిలుస్తుందని మేకర్స్ ధీమాగా చెబుతున్నారు.
ఈ మూవీ ప్రమోషన్స్ భారీగా ప్లాన్ చేశారు. ఇండియన్ సినిమా హిస్టరీలోనే అత్యధిక ప్రీ-రిలీజ్ బిజినెస్‌ను ‘పుష్ప 2’ అందుకుందని టాక్ అయితే వస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్ అద్భుతంగా జరిగే అవకాశం ఉండటంతో, మొదటి రోజు రికార్డును బ్లాస్ట్ చేయడం ఖాయం అంటున్నారు. అల్లు అర్జున్ (Allu Arjun) సాంగ్స్, డైలాగ్స్ ఇప్పటికే నార్త్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. హిందీలో ఇప్పటి వరకు అత్యధిక ఫస్ట్ డే కలెక్షన్స్ సాధించిన చిత్రాలు షారుఖ్ ఖాన్ ఆధిపత్యంలోనే ఉన్నాయంటే, ‘పుష్ప 2’కు ఇది ఒక కీలక పరీక్ష. మరి, పుష్ప రాజ్ షారుఖ్‌ను వెనక్కి నెట్టగలడా? లేదా అనేది చూడాలి.