జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు సందర్భంగా తెలంగాణలో చాలా మందికి సెలవు రోజు. కాబట్టి ఇదే రోజుని టార్గెట్ చేసి కొన్ని చిన్న సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందులో ‘చక్రవ్యూహం : ది ట్రాప్’ మూవీ కూడా ఒకటి. విలక్షణ నటుడు అజయ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన మూవీ ఇది. టీజర్, ట్రైలర్ లు ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. ‘మైత్రి మూవీ డిస్ట్రిబ్యూషన్’ సంస్థ ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేయడంతో కూడా ఈ మూవీ పై కొందరి ఫోకస్ పడింది. మరి ఈ మూవీ ఎంత వరకు ప్రేక్షకులను ఆకట్టుకుందో తెలుసుకుందాం రండి :
కథ : సిరి(ఊర్వశి పరదేశి) , సంజయ్ (వివేక్ త్రివేది) ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. ఇద్దరూ హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంటారు. అయితే అనూహ్యంగా ఓ రోజు సిరి హత్య చేయబడుతుంది. ఆమె హత్య కేసును దర్యాప్తు చేయడానికి సి. ఐ. సత్య (అజయ్) రంగంలోకి దిగుతాడు. దుర్గా నాయక్( జ్ఞానేశ్వరి కాండ్రేగుల) అతనికి అసిస్టెంట్.
ఇక సత్య ఈ కేసు దర్యాప్తు చేస్తున్న క్రమంలో.. అతను అనుమానించిన వాళ్ళు చనిపోతూ ఉంటారు. కాబట్టి కేసు ఇంకా కాంప్లికేటెడ్.. అవుతుంది. చివరికి అతను ఈ కేసును ఎలా సాల్వ్ చేశాడు. అతనికి ఎదురైన సమస్యలు ఏంటి అన్నది మిగిలిన కథ.
నటీనటుల పనితీరు : అజయ్ హీరోగా చేయడం ఇది మొదటి సారి అంటూ ఈ సినిమాని ప్రమోట్ చేశారు. కానీ కాదు … గతంలో ‘సారాయి వీర్రాజు’, ‘ఆ ఒక్కడు’ వంటి సినిమాల్లో కూడా హీరోగా నటించాడు. ఆ సినిమాలు ఆడకపోవడంతో మళ్లీ హీరోగా చేయాలి అనే ప్రయోగాలు చేయలేదు. అయితే ఈ చక్రవ్యూహం లో అతను హీరో రోల్ అనడం కంటే ప్రధాన పాత్ర అనాలి. అందుకే ఈ సినిమాలో అతని నటన కన్విన్సింగ్ గా అనిపిస్తుంది. కాకపోతే అతని కటౌట్ కు తగ్గ యాక్షన్ ఎలిమెంట్స్ ఉంటే ఇంకా బాగుండేదేమో.
ఇక జ్ఞానేశ్వరి కాండ్రేగుల పోలీస్ గా బాగానే చేసింది. కిరీటి, మామిళ్ళ శైలజ ప్రియా ఓకే అనిపించారు. మిగిలిన నటీనటుల్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ‘దసరా’ ఫేమ్ రవితేజ నన్నిమల గురించి. సీరియస్ గా సాగే మూవీలో కూడా తన మార్కు నటనతో అక్కడక్కడ నవ్వులు పూయించడమే కాకుండా, సీరియస్ రోల్స్ కూడా అవలీలగా పోషించగలను అని ఈ చిత్రంతో మరోసారి ప్రూవ్ చేశాడు.రానున్న రోజుల్లో అతను స్టార్ పెర్ఫార్మర్ అవ్వడం ఖాయమనిపిస్తుంది.
సాంకేతిక నిపుణుల పనితీరు : దర్శకుడు చెట్కూరి మధు సూదన్ ఎంపిక చేసుకున్న పాయింట్ బాగానే ఉంది. కాకపోతే థ్రిల్లర్ సినిమాలకు ప్రధానంగా కావాల్సింది మంచి స్క్రీన్ ప్లే. ఫస్ట్ హాఫ్ ఈ మూవీ బాగానే ఎంగేజ్ చేసింది. సెకండ్ హాఫ్ లో ఎవ్వరూ ఊహించని ట్విస్ట్ లు ఇచ్చి సర్ప్రైజ్ చేసినా.. కథ ఆ తర్వాత నుండి సైడ్ ట్రాక్ కు వెళ్ళిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. అయినప్పటికీ లాస్ట్ లో ఎవ్వరూ ఊహించని విధంగా అజయ్ పాత్రతో మరో ట్విస్ట్ ఇచ్చి ఓకే అనిపించేసాడు దర్శకుడు.
జి వి అజయ్ కుమార్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఓపెనింగ్ సీన్ అలాగే సీసీ టీవీ ఫుటేజ్ సీన్ల వద్ద తన పనితనం చూపించాడు. భరత్ మంచిరాజు అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఓకే. నిర్మాణ విలువలు కథకు తగ్గట్టు బాగానే ఉన్నాయి. నిర్మాతలకు కూడా మంచి టేస్ట్ ఉందనే ఫీలింగ్ అందరికీ కలగొచ్చు.
విశ్లేషణ : సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడేవారికి ఈ సినిమా (Chakravyuham) కొంత వరకు టైం పాస్ చేసే అవకాశాలు ఉన్నాయి. పార్ట్ 2 కూడా ఉంటుందని హింట్ ఇచ్చారు. అయితే దీన్ని ప్రేక్షకులు ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారు అనేది చూడాలి.
రేటింగ్ : 2.5 / 5