చిరంజీవి స్పీడ్ ఇప్పుడున్న పరిస్థితులకు సరిపోతుందా? ఆయన నెక్స్ట్ సినిమా ముందు సినిమా పరాభవాన్ని మరిపిస్తుందా? చిరంజీవిని నెవర్ బిఫోర్‌గా మోహన్ రాజా చూపిస్తారా? అసలు చిరంజీవి బౌన్స్ బ్యాక్ అవుతారా?… ఇదీ సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న చర్చ. దీనికి రెండు కారణాలున్నాయి. ఒకటి చిరంజీవి గత చిత్రం ‘ఆచార్య’ దారుణమైన పరాజయం, రెండోది నెక్స్ట్ సినిమా ‘గాడ్ ఫాదర్’కి ఇప్పటివరకు అనుకున్నంత హైప్ రాకపోవడం.
‘గాడ్ ఫాదర్’కి సంబంధించి చిత్రబృందం ఇప్పటివరకు ఓ వీడియో, కొన్ని ఫొటోలను రిలీజ్ చేసింది. అవన్నీ బాగున్నాయి తప్ప.. అద్భుతంగా లేవు అనేది కొంతమంది ఫ్యాన్స్ మాట. ఆ మధ్య విడుదల చేసిన ప్రీ టీజర్లో చిరంజీవి అలా కారు నుండి దిగి నడుచుకుంటూ వెళ్లిపోవడం కనిపిస్తుంది. ఇలాంటి వీడియోలు, షాట్స్ గతంలో చాలానే చూశాం. ప్రశాంత్ నీల్, సుకుమార్ చూపించిన ఎలివేషన్ల దగ్గర ఆ సీన్స్ ఏమాత్రం కిక్ ఇవ్వలేదు.
పోనీ పోస్టర్లలో అయినా ఏమన్నా కొత్తదనం చూపిస్తారా అంటే అందులోనూ పాత స్టైల్ లుక్‌లు కనిపిస్తున్నాయి. ఈ సినిమా కోసం చిరంజీవి మేకోవర్ చేశారు అని అంటున్నారు కానీ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ తప్ప ఇంకేం కనిపించడం లేదు. అయితే సినిమాల్లో ఏమన్నా ఆ స్థాయి ఫీల్ అందిస్తారా? అనేది చూడాలి. కనీసం ట్రైలర్ వీడియోలతో అయినా ఇది మూస చిరంజీవి సినిమా కాదు అనే ఫీలింగ్ కలిగించాలి.
ఎందుకంటే ‘ఆచార్య’ చిరంజీవి ఫ్యాన్స్ బాగా డౌన్ అయిపోయారు. సినిమాలో విజిల్ కొట్టే సీన్లు గట్టిగా రెండు కూడా లేవు. ఇప్పుడు ‘గాడ్ ఫాదర్’లో ఆ లోటు తీరకపోతే మళ్లీ ఇబ్బంది వస్తుంది. ‘లూసిఫర్’లో అయితే ఇలాంటి ఆప్షన్లు చాలానే ఉన్నాయి. మరి మోహన్ రాజా ఏ మేరకు వాటిని మెగా ఫ్యాన్స్‌కు ఫీస్ట్‌గా మలిచి అందిస్తారో చూడాలి. విజయదశమి సందర్భంగా సినిమాను విడుదల చేస్తాం అని చెబుతున్నారు. ప్రచారంలో పెద్దగా కొత్తదనం కనిపించడం లేదు. కాబట్టి మూస అనే ఫీలింగ్‌ను గట్టిగా పోగొట్టాలి ‘గాడ్ ఫాదర్’ టీమ్.