చిరంజీవి సినిమాలకు స్వస్తి పలికి చాలా ఏళ్లవుతోంది. అయితే.. అప్పుడెప్పుడో వచ్చిన “మగధీర”, మొన్నీమధ్య వచ్చిన “బ్రూస్ లీ” చిత్రాల్లో అతిధి పాత్రల్లో మెరిసి మెగా అభిమానులను కొంతలో కొంత సంతృప్తి పరిచారు.
అయితే.. మెగాస్టార్ రీఎంట్రీ ఎప్పుడా అని ఆయన అభిమానులందరూ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. తమిళ సూపర్ హిట్ చిత్రం “కత్తి” రీమేక్ లో చిరు నటించనున్నారని, దానికి వివి.వినాయక్ దర్శకత్వం వహించనున్నాడని తెలిసాక వారి ఆనందం అవధులు దాటింది. తీరా.. ఆ సినిమా ఇప్పటికీ పట్టాలెక్కకపోవడంతో అభిమానులు నిరాశ చెందారు. కట్ చేస్తే.. ఇప్పుడు “కత్తి” రీమేక్ ను కూడా చిరు వద్దన్నాడని, ఇప్పుడు వినాయక్ కొత్త కథను సిద్ధం చేస్తున్నాడని విశ్వసనీయవర్గాల సమాచారం. చూస్తుంటే.. చిరు 151వ సినిమా ఈ ఏడాది సెట్స్ కు వెళ్ళే అవకాశం లేనట్లే!