శింబు చిరకాల హిట్ దాహాన్ని తీర్చిన చిత్రం ‘మానాడు’. ఇదేంటి ఇంత సింపుల్‌గా చెప్పేశారు అనుకుంటున్నారా? చెప్పడం సింపుల్‌గా చెప్పేశాం కానీ… విషయం ఏ మాత్రం సింపుల్ కాదు. ఎందుకంటే ఇది రీమేక్ హక్కలకు సంబంధించిన అంశం కాబట్టి. ‘మానాడు’ తమిళంలో మంచి విజయం అందుకున్నాక… తెలుగులో ఎందుకు రిలీజ్ చేయలేదు అని అనుకున్నారంతా. అయితే తెలుగులో రీమేక్ చేయాలని చూస్తున్నారు కాబట్టే… తెలుగు వెర్షన్ (‘లూప్’) రిలీజ్ చేయలేదు అనేది తర్వాత తెలిసింది. తాజాగా ఈ రీమేక్ గురించి ఆసక్తికర విషయం ఒకటి బయటకు వచ్చింది.
‘మానాడు’ సినిమా రీమేక్ హక్కుల ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఈ సినిమా హక్కులు గీతా ఆర్ట్స్ తీసుకుందని కొందరు, తీసుకోవాలని అనుకుంటోందని ఇంకొంరు చెప్పుకుంటూ వచ్చారు. కానీ తాజాగా రీమేక్ హక్కుల విషయంలో స్ఫష్టత వచ్చింది. ఈ సినిమా రీమేక్ హక్కుల్ని సురేశ్ ప్రొడక్షన్స్ కైవసం చేసుకుందట. నిజానికి ఈ సినిమాను అల్లు అరవింద్ కొనుగోలు చేశారని, అల్లు శిరీష్ కానీ, మరో మెగా కుర్ర హీరోతో కానీ తీస్తారని అన్నారు. అయితే సురేశ్ ప్రొడక్షన్ రిలీజ్ చేసిన లీగల్ నోటీసు ఇచ్చిందని టాలీవుడ్లో టాక్.
టాలీవుడ్లో ప్రముఖ నిర్మాణ సంస్థ ఒకటి… ‘మానాడు’కు పోలిన సబ్జెక్ట్‌ను సిద్ధం చేస్తోందని సమాచారం వచ్చేసరికే… సురేశ్ ప్రొడక్షన్స్ ఇలా లీగల్ నోటీసుల వరకు వచ్చిందని అంటున్నారు. అయితే ఇప్పుడు ఆ నిర్మాణ సంస్థ ఆ ప్రయత్నాలు మానేస్తుందా? లేక అందులో మార్పులు చేసి అదే కథను ముందుకు తీసుకెళ్తుందా అనేది చూడాలి. అయితే ఈ క్రమంలో ‘మానాడు’ రీమేక్ విషయంలో క్లారిటీ అయితే వచ్చేసింది. సురేశ్ ప్రొడక్షన్స్ ఈ సినిమా రూపొందిస్తుంది అనేది పక్కా అయ్యింది.
‘మానాడు’ రీమేక్ చేస్తే ‘నేను నటిస్తా’ అని రవితేజ మాటిచ్చాడని ఆ మధ్య దర్శకుడు వెంకట్ ప్రభు చెప్పారు. ఇప్పడు మరి సురేశ్ ప్రొడక్షన్స్ సినిమా చేస్తే రవితేజ నటిస్తాడా లేదా అనేది చూడాలి. ఇంకో విషయం దీనికి దర్శకుడు ఎవరు అనేది చూడాలి. కొత్త దర్శకుడు వస్తాడా? లేక వెంకట్ ప్రభునే చేస్తారా అనేది చూడాలి. ఇదేంటి ఇన్ని చెబుతున్నారు హీరో ఎవరు అనేది అడగరా? అనుకుంటున్నారా. ఇంకెవరు చేస్తారు వెంకటేశే. ఆయన కాకపోతే అప్పుడు చూద్దాం.