ట్రెండ్‌కి తగ్గట్టుగా వినూత్నమైన కంటెంట్ అందించడంలో ప్రముఖ డిజిటల్ మీడియా సంస్థ ‘తమడా మీడియా’ ఎప్పుడూ ముందుంటుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా వైవిధ్యమైన కథలతో అందరి మన్ననలు పొందుతోంది.ఈ సంస్థ నుండి వస్తోన్న లేటెస్ట్ షార్ట్ మూవీ ‘కాలనీ సర్కస్’. ‘ఈటీవీ విన్’ వారి ‘కథా సుధ’లో భాగంగా రూపొందిన ఈ సినిమా, ఈరోజు (అనగామే 24) నుండి స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేర ఆకట్టుకుందో తెలుసుకుందాం రండి:
కథ: ఇది 1996 నేపథ్యంలో సాగే ఒక పీరియాడిక్ డ్రామా. కాకినాడలోని ఒక ప్రభుత్వ ఉద్యోగుల కాలనీ, అక్కడ క్వార్టర్స్‌లో ఉండే ప్రజల మధ్య ఉండే ఇగోలను ప్రధాన అంశంగా చేసుకుని అల్లిన కథ ఇది.సూర్యనారాయణ (వెంకటేష్ మహా) ఒక మ్యాథ్స్ టీచర్. మర్యాద విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటాడు. ఎవరైనా తనకు ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇవ్వలేదు అంటే.. దాన్ని తిరిగి పొందేందుకు ఎంత దూరమైనా వెళ్తాడు. సూర్యనారాయణ భార్య అన్నపూర్ణకి(ఉద్విత) టీవీ సీరియల్స్ అంటే పిచ్చి.సూర్యనారాయణ కొడుకు రవికి(మాస్టర్ ఆరవ్) క్రికెట్ అంటే పిచ్చి.సూర్యనారాయణ తండ్రి మూర్తి(రేవతి నాథ్), రోజూ ఇంట్లోనే కూర్చుని రేడియో వింటూ కాలక్షేపం చేస్తుంటాడు. మరోవైపు గోవిందరావు(కిరీటీ) కలెక్టర్ ఆఫీస్‌లో పనిచేసే ఓ క్లర్క్.
సూర్యనారాయణకు ఇతనంటే కోపం.ఆ కాలనీలో ఉండే మిగిలిన జనాలు టీవీ ఉన్నవాళ్ల ఇంటికి వెళ్లి తమకు నచ్చిన ప్రోగ్రామ్స్ చూస్తుంటారు. సూర్యనారాయణ కూడా రోజూ వార్తలు చూడటానికి పక్కింటి వాళ్ళ టీవీ వద్దకి వెళ్తుంటాడు. అయితే, అక్కడ అతను కూర్చునే కుర్చీని ఆక్రమించి, కలెక్టర్ ఆఫీస్ క్లర్క్ గోవిందరావు అతన్ని అవమానిస్తూ ఉంటాడు. ఇది సూర్యనారాయణకు అస్సలు నచ్చదు. దీంతో ఎలాగైనా సరే ఒక కలర్ టీవీ కొనేయాలని డిసైడ్ అవుతాడు. ఇందుకోసం భార్య పొదుపు చేసిన డబ్బులతో పాటు, కొడుకు రవి దాచుకున్న పాకెట్ మనీ, తండ్రికి వచ్చిన కవుల డబ్బులను అంతా తీసుకెళ్లి టీవీ కొనేస్తాడు. తన ఇంట్లోనే, కాలనీ జనాల మధ్య కుర్చీలో కూర్చుని, దర్జాగా కాలుమీద కాలేసుకుని వార్తలు చూస్తూ పోయిన రెస్పెక్ట్ తిరిగి పొందాలనేది సూర్యనారాయణ లక్ష్యం.
కానీ, అదే టీవీలో కాలనీ గృహిణులతో కలిసి సీరియల్స్ చూడాలని భార్య అన్నపూర్ణ, తన స్నేహితులతో కలిసి క్రికెట్ మ్యాచ్‌లు చూడాలని కొడుకు రవి ఆశపడతారు.దీంతో ఒకే టీవీ కోసం ఆ ఇంట్లోనే ముగ్గురి మధ్య చిన్న క్లాష్ మొదలవుతుంది. ఈ సమస్యను పరిష్కరించడానికి తండ్రి మూర్తి ఒక కండిషన్ పెడతాడు.అదేంటంటే… ‘టీవీలో ఎవరు ఏ ప్రోగ్రాం చూడాలనే హక్కు సాధించుకునేందుకు కాలనిలో ఎలక్షన్ జరపాలని డిసైడ్ అవుతాడు. ఆ ఎన్నికల్లో ఎవరు గెలిచారు? ఆ గెలుపు కోసం ఎలాంటి ప్లాన్స్ వేశారు? చివరికి సూర్యనారాయణ లక్ష్యం నెరవేరిందా? అనేది మిగిలిన కథ.
నటీనటుల పనితీరు: వెంకటేష్ మహా లెక్కల మాస్టారుగా కరెక్ట్ గా సెట్ అయ్యాడు. అతని లుక్స్ కూడా డీసెంట్ గా ఉన్నాయి. ఉద్విత హర్ష అన్నపూర్ణ పాత్రలో నేచురల్ గా కనిపించింది నటించింది కూడా. చైల్డ్ ఆర్టిస్ట్ ఆరవ్ అందరి కంటే ఎక్కువ మార్కులు కొట్టేశాడు అని చెప్పాలి. కిరీటీ కూడా తన పాత్రకి న్యాయం చేశాడు. హీరో తండ్రి పాత్ర చేసిన రేవతినాథ్ లుక్, నటన కూడా నేచురల్ గా ఉన్నాయి. మిగతా నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు బాగా చేశారు.
సాంకేతిక నిపుణుల పనితీరు: ఒక చిన్న కథని పెద్దగా చెప్పడం కష్టం కాదు, ఎందుకంటే అందుకు బోలెడన్ని సీన్లు జోడించుకునే సౌలభ్యం ఉంటుంది. కానీ పెద్ద కథని తక్కువ నిడివిలో ఎంగేజింగ్ గా చెప్పడమే అసలైన టాస్క్. దర్శకుడు శశాంక్ పోసింశెట్టి ఈ విషయంలో నూటికి నూరు శాతం సక్సెస్ అయ్యాడు. మొదటి సీన్ నుంచే ప్రేక్షకులను తన ప్రపంచంలోకి తీసుకెళ్లిన దర్శకుడు, ఆ తర్వాత కథనాన్ని ఎక్కడా స్లో చేసింది లేదు. ప్రతి సీన్ ఎంతో ఆసక్తికరంగా సాగుతూ.. తర్వాతి సీన్ పై క్యూరియాసిటీ పెంచే విధంగా ఉంటుంది. ‘ఉద్యోగాల కంటే ఇగోలకే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ సాటి మనిషిని ఎలా దూరం చేసుకుంటున్నామో’ ఈ సినిమా ద్వారా చాలా చక్కగా గుర్తుచేశాడు. కథనాన్ని ఎంటర్‌టైనింగ్‌గా నడిపిస్తూనే, క్లైమాక్స్‌లో ఇచ్చిన మెసేజ్ కూడా మనసుకు హత్తుకుంటుంది.
అయితే, కథ 1996 నేపథ్యంలో సాగుతున్నప్పుడు.. హీరో కొడుకు పాత్రతో 2000 సంవత్సరంలో వచ్చిన ‘దేవుళ్ళు’ సినిమాలోని ‘ఆలోచించండి ఓ అమ్మా నాన్న’ పాటను పాడించడం కాస్త లాజిక్‌కు విరుద్ధంగా అనిపించింది. ఈ చిన్న పొరపాటు మినహాయిస్తే కథనంలో మరే లోపాలు కనిపించవు.టెక్నికల్ గా చూసుకుంటే.. జె.వి. సుధాంశు బ్యాక్ గ్రౌండ్ స్కోర్, శ్రీవత్స గొర్ల సినిమాటోగ్రఫీ సినిమాకు మంచి రిచ్ క్వాలిటీని తీసుకొచ్చాయి. ఇలాంటి షార్ట్ మూవీస్‌కి ఎడిటింగ్ పెద్ద ఛాలెంజింగ్ గా ఉంటుంది. కానీ ఈ విషయంలో సృజన్ శర్మ కపిల ఎక్కడా తడబడలేదు. చాలా బ్యాలెన్స్‌డ్‌గా వ్యవహరించినట్టు ప్రతి ఫ్రేమ్ . నిర్మాతలు రాహుల్ తమడా, సాయి దీప్ రెడ్డి బొర్రా ఎక్కడా ఖర్చుకి వెనుకాడకుండా ఎంతో ప్యాషన్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. 1996 నాటి వాతావరణాన్ని ప్రతిబింబించేలా వేసిన కాలనీ సెట్ పర్ఫెక్ట్‌గా కుదిరింది.
విశ్లేషణ: చేతిలో ఫోన్ ఉంటే ప్రపంచం మన చేతిలో ఉన్నట్టేననే అపోహలో ఉంటూ.. ఫోన్‌కు మనం బానిసలైపోతున్న రోజులు ఇవి. ఒకే ఇంట్లో ఉంటున్నా, మనుషుల మధ్య ఈ ఫోన్లు అడ్డుగోడలుగా మారుతున్నాయి. అయితే, ఇలాంటి డిజిటల్ లోకం నుండి కాసేపు మనల్ని 1996 లోకి తీసుకెళ్లి.. అప్పటి రోజులు ఎంత బ్యూటిఫుల్‌గా ఉండేవో, ఇగోలను మనుషులు ఎలా అధిగమించేవారో గుర్తుచేసిన చక్కటి సినిమా ఈ ‘కాలనీ సర్కస్’. ప్రస్తుతం ఇది ‘ఈటీవీ విన్’ ఓటీటీలో అందుబాటులో ఉంది. ఈ సండే ఇంట్లో కూర్చొని ఈ మినీ మూవీని హ్యాపీగా ఫ్యామిలీతో కలిసి వీక్షించొచ్చు.
ఫోకస్ పాయింట్: ‘కాలనీ సర్కస్’… ఏ బ్యూటిఫుల్ నోస్టాల్జియా రైడ్
రేటింగ్: 3/5