చిరంజీవి హీరోగా నటించిన ‘భోళా శంకర్’ సినిమా రేపు రిలీజ్ కాబోతోంది. మెహర్ రమేష్ ఈ చిత్రానికి దర్శకుడు. రెండు రోజుల నుండి ఈ చిత్రం రిలీజ్ అవుతుందా లేదా అనే టెన్షన్ అందరిలోనూ ఉంది. ఎందుకంటే నిర్మాత అనిల్ సుంకర ఓ కేసులో ఇరుక్కున్నాడు. అయితే రిలీజ్ కి ఎటువంటి అడ్డంకి లేదు కానీ ‘భోళా శంకర్’ డిజిటల్ రైట్స్ ను మాత్రం కోర్టు పెండింగ్ లో పెట్టినట్లు తెలుస్తుంది. వివరాల్లోకి వెళితే.. వైజాగ్ కు చెందిన ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ బత్తుల సత్యనారాయణ అలియాస్ సతీష్, అడ్వొకేట్ కేశాపురం ఈ విషయాన్ని వెల్లడించినట్టు తెలుస్తుంది.
‘ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్’ అధినేతలు తన దగ్గర బ్యాంకు లావాదేవీల రూపంలో 30 కోట్లు తీసుకుని, తనకు రాసి ఇచ్చిన అగ్రిమెంట్ ను అమలుపరచకుండా మోసం చేశారని డిస్ట్రిబ్యూటర్ సతీష్ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో కేసు వేశారు. తనకు డబ్బులు చెల్లించేంతవరకు ‘భోళా శంకర్’ సినిమా విడుదలను అన్ని ఫ్లాట్ ఫార్మ్స్ లో నిలుపుదల చేయాలని పిటిషన్లో పేర్కొన్నట్టు తెలుస్తుంది. ఐదు ఐ.ఎ.లు వేయగా నాలుగింటిని డిస్మిస్ చేశారని, “భోళా శంకర్” (Bhola Shankar) డిజిటల్ రైట్స్ ఐ.ఎ. నెంబర్ 304 ను మాత్రం పెండింగ్ లో పెట్టడం జరిగిందని వారు వివరించినట్లు తెలుస్తోంది.
శుక్రవారం సాయంత్రానికి కోర్టు ఆర్డర్ కాపీ వస్తే, అందులో పూర్తి వివరాలు తెలుస్తాయని వారు చెప్పారు. మెయిన్ సూట్ కోర్టులో కొనసాగుతుందని, సెప్టెంబర్ 13వ తేదీ తదుపరి విచారణ జరుగుతుందని కూడా వారు పేర్కొన్నారు. గౌరవనీయ కోర్టు తీర్పును మేము శిరసావహిస్తామని, తనకు రావలసిన డబ్బుల విషయంలో న్యాయం జరుగుతుందనే నమ్మకం కలిగి ఉన్నట్లు కూడా బత్తుల సత్యనారాయణ (సతీష్) ధీమా వ్యక్తం చేశారు. కోర్టు ఆర్డర్ కాపీ అందగానే హైకోర్టుకు వెళ్తామని కూడా ఈ సందర్భంగా వారు తెలియజేశారు.