“వాల్తేరు వీరయ్య”తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన బాబీ కొల్లి దర్శకత్వంలో.. వరుస విజయాలతో దూసుకుపోతున్న బాలయ్య టైటిల్ పాత్రలో.. నిర్మాతగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను ఆటిట్యూడ్ తో క్రియేట్ చేసుకున్న నిర్మాత నాగవంశీ సారథ్యంలో రూపొందిన చిత్రం “డాకు మహరాజ్”. ప్రతి ఏడాది సంక్రాంతి బరిలో బాలయ్య సినిమా ఉండడం ఆనవాయితీ.. ఆ ఆనవాయితీని కొనసాగిస్తూ భోగి పండుగకు ముందు రోజున “డాకు మహరాజ్”ను థియేటర్లలో విడుదల చేసారు. మరి ఈ సంక్రాంతికి కూడా బాలయ్య తన బ్లాక్ బస్టర్ మ్యాజిక్ ని రిపీట్ చేశాడా? లేదా? అనేది చూద్దాం..!!
కథ: తాను బాధ్యతగా భావించే చిన్నారి వైష్ణవి ప్రాణానికి ముప్పు ఉందని తెలుసుకొని.. జైలు నుండి తప్పించుకొని మరీ కృష్ణమూర్తి (సచిన్ కేడ్కర్) కుటుంబంలో నానాజీ అనే మారుపేరుతో డ్రైవర్ గా ఎంట్రీ ఇస్తాడు సీతారాం అలియాస్ డాకు మహరాజ్ (బాలకృష్ణ). వైష్ణవి ప్రాణానికి ప్రమాదమైన లోకల్ ఎమ్మెలే గ్యాంగ్ భరతం పట్టి.. వాళ్ల వెనుక ఉన్న బల్వంత్ సింగ్ ఠాకూర్ (సన్నీ డియోల్) & కోను బయటికి లాగుతాడు.
అసలు సీతారాం ఎవరు? డాకు మహరాజ్ గా ఎందుకు మారాల్సి వచ్చింది? కృష్ణమూర్తి ఫ్యామిలీతో అతనికున్న సంబంధం ఏమిటి? ఠాకూర్ ను ఎందుకు ఎదిరించాల్సి వచ్చింది? వంటి ప్రశ్నలకు సమాధానమే “డాకు మహరాజ్”.
నటీనటుల పనితీరు: ఈ తరహా పాత్రల్లో సీనియర్ హీరోల్లో బాలయ్యను తప్ప ఎవ్వరినీ ఊహించలేం. సీతారాం పాత్రలో కంటే డాకు మహరాజ్ & నానాజీగా బాలయ్య పెర్ఫార్మెన్స్ అదిరిపోయింది. నందమూరి అభిమానులకు మాత్రమే కాదు సగటు మాస్ సినిమా ప్రేక్షకులందరినీ ఈ ఈ రెండు పాత్రలు విశేషంగా ఆకట్టుకుంటాయి. యాక్షన్ బ్లాక్స్ లో బాలయ్య స్టంట్ డబుల్స్ లేకుండా చేసిన పోరాట సన్నివేశాలు సినిమాకి హైలైట్ గా నిలుస్తాయి.
శ్రద్ధ శ్రీనాథ్ ఒక క్యారెక్టర్ ఒప్పుకుంది అంటే దానికి వేల్యు ఉంటుంది అనేది ఎంత నిజమో ఈ సినిమాలో ఆమె పాత్ర చూసాక అర్థమవుతుంది. కనిపించేది సెకండాఫ్ లో కొంచెం సేపే అయినప్పటికీ.. నటిగా మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది.
ప్రగ్యా జైస్వాల్ కి మంచి ఎలివేషన్స్ పడ్డాయి కానీ.. ఆమె టెంప్లేట్ యాక్టింగ్ వల్ల ఆమె సరిగా ఎలివేట్ అవ్వలేదు.
ఇక ఊర్వశి ఒక గ్లామర్ డోస్ మాత్రమే. ఆమెతో చిత్రించిన “దబిడి దిబిడి” పాటలో లిరికల్ సాంగ్ లో కనిపించిన ఇబ్బందిపెట్టే స్టెప్స్ ను ఎడిట్ చేసి మంచి పని చేశారు.
డాకు మహరాజ్ సైనికులుగా కనిపించిన రవి కాలే, మకరంద్ దేశ్ పాండే, దివి తదితరులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.
సన్నీ డియోల్ ను సరిగా వినియోగించుకోలేదు. ఇంట్రడక్షన్ సీన్ కూడా సీజీ సెట్ అవ్వలేదో ఏమో కానీ.. ఎడిటింగ్ తో మ్యానేజ్ చేసారు. సన్నీ డియోల్ ఫుల్ పొటెన్షియల్ ను వినియోగించుకోలేదు అనిపించింది.
సాంకేతికవర్గం పనితీరు: ముందుగా మాట్లాడుకోవాల్సింది తమన్ గురించి.. ప్రతి సన్నివేశాన్ని, ప్రతి ఎలివేషన్ ను తనదైన శైలికి భిన్నమైన నేపథ్య సంగీతంతో పదింతలు ఎలివేట్ చేశాడు. పాటలు చెప్పుకోదగ్గ స్థాయిలో లేకపోయినప్పటికీ.. నేపథ్య సంగీతం మాత్రం ఇరగ్గొట్టాడు. తమన్ ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్లు, రజనీకాంత్ కి బక్కోడు (అనిరుధ్) ఉంటే.. బాలయ్యకి బండోడు (తమన్) ఉన్నాడు అని నిరూపించుకున్నాడు.
రవితేజ “రావణాసుర”, రజనీకాంత్ “జైలర్” సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేసిన విజయ్ కార్తీక్ కన్నన్ లెన్స్ వర్క్ ఈ సినిమాకి ప్రాణం. బాలయ్యను ఎలివేట్ చేసిన ప్రతి ఫ్రేమ్ కొత్తగా ఉంది, బాలయ్య కళ్లను కొత్తగా చూపించాడు విజయ్ కార్తీక్. ఈ సినిమా తర్వాత విజయ్ కార్తీక్ తెలుగులో బిజీయస్ట్ సినిమాటోగ్రాఫర్ అయిపోతాడు.
ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త కేర్ తీసుకోవాల్సింది. యాక్షన్ బ్లాక్స్ బాగానే కట్ చేసారు కానీ.. మిగతా సీన్స్ కూడా కాస్త స్మూత్ గా కట్ చేసి ఉంటే బాగుండేది.
దర్శకుడు బాబీ సబ్జెక్ట్ మీద కంటే స్టైల్ మీద ఎక్కువ శ్రద్ధ చూపించాడు. యాక్షన్ బ్లాక్స్ కంపోజిషన్ & సీన్ కంపోజిషన్ విషయంలో నిజంగానే ఒక రిఫరెన్స్ లా ఉండేలా డాకు మహారాజ్ ను తెరకెక్కించాడు. అయితే.. ఎమోషనల్ గా సినిమాను ఆకట్టుకునే స్థాయిలో నడిపించలేకపోయాడు. ఫస్టాఫ్ చూసాక ఇది బాలయ్య “జైలర్” అనిపిస్తుంది.. కానీ సెకండాఫ్ కి వచ్చేసరికి విలన్ కి సరైన క్యారెక్టర్ ఆర్క్ లేక, కథలో ఎమోషన్ సరిగా పండక ఫస్టాఫ్ ఇచ్చిన ఊపుని కాస్త ఎఫెక్ట్ చేస్తుంది. అలాగే.. క్లైమాక్స్ ను కూడా ఇంకాస్త బాగా డిజైన్ చేసి ఉంటే బాగుండేది. ఎందుకంటే.. ఫస్టాఫ్ లో యాక్షన్ బ్లాక్స్ తో ఒక రేంజ్ క్రియేట్ చేశాడు బాబీ, అలాంటిది సెకండాఫ్ లో డాకు ఎపిసోడ్స్ కూడా అంతలా అలరించలేకపోయాయి. ఓవరాల్ గా.. ఒక దర్శకుడిగా అలరించాడు కానీ, కథకుడిగా పూర్తిస్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు.
ప్రొడక్షన్ డిజైన్ & ఆర్ట్ డిపార్ట్మెంట్ మాత్రం చాలా కష్టపడ్డారు. ముఖ్యంగా మార్బుల్ మైనింగ్ సీన్స్ & విలన్ స్థావరాలను డిజైన్ చేసిన విధానం బాగుంది. అయితే.. మార్బుల్ మైన్స్ సీక్వెన్స్ దగ్గర కలర్ గ్రేడింగ్ విషయంలో కాస్త జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది.
విశ్లేషణ: ఫస్టాఫ్ లో ఎలివేషన్స్ & యాక్షన్ బ్లాక్స్ ఫ్యాన్స్ & మాస్ ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకుంటాయి. అందులో ఎలాంటి సందేహం లేదు, అయితే.. సెకండాఫ్ లో ఆ ఊపు లోపించింది. ముఖ్యంగా ఎమోషన్స్ ను పండించడంలో బాబీ తడబడ్డాడు. అందువల్ల సెకండాఫ్ కి వచ్చేసరికి సినిమా ఒక్కసారిగా రివర్స్ గేర్ వేసిన అనుభూతి. మధ్యలో డాకు ఎపిసోడ్స్ కాస్త హుషారు నింపినా.. ఎలివేషన్ కి తగ్గ ఎమోషన్ పండకపోవడంతో ప్రేక్షకులు ఆ సన్నివేశంలోని విజిల్ వేసే స్థాయి సీన్స్ ను పూర్తిగా ఆస్వాదించలేరు. ముఖ్యంగా క్లైమాక్స్ ఫైట్ కంపోజిషన్ మైనస్ గా మారింది. అయితే.. సంక్రాంతి సీజన్ & ఫస్టాఫ్ ఈ సినిమాని సూపర్ హిట్ గా నిలపడం ఖాయం. అయితే.. బాబీ సెకండాఫ్ విషయంలో కేర్ తీసుకొని ఉంటే మాత్రం బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచి ఉండేది.
ఫోకస్ పాయింట్: అదిరింది మహరాజ్!
రేటింగ్: 3/5