Darshan: కారుకు వేలాడదీసి.. తాడుతో కొట్టారట.. దర్శన్‌ చుట్టూ బిగిసిన ఉచ్చు

కన్నడ నాట పెను సంచలనం సృష్టించిన హీరో దర్శన్‌ అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో అనుకున్నట్లుగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో 14వ నిందితుడిగా ఉన్న దర్శన్ అనుచరుడు ప్రదోష్ అప్రూవర్‌గా మారిపోయాడు. ఈ క్రమంలో కొన్ని సంచలన విషయాలు బయటపెట్టాడు. ఘటన జరిగిన రోజు నుండి సాక్ష్యాలను తారుమారు చేసే వరకు జరిగిన ప్రతీ విషయాన్ని తన అప్రూవర్‌ పిటిషన్‌లో చెప్పేశాడు. దీనికి సంబంధించిన వివరాలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

Darshan

ప్రదోష్‌ తన పిటిషన్‌లో పేర్కొన్న అంశాలు ఇవీ అంటూ కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. పవిత్ర గౌడకు పంపిన మెసేజ్‌ల విషయంలో రేణుకా స్వామిని దర్శన్‌ నిలదీశారు. ఆ సమయంలో ఆయన తీవ్ర పదజాలంతో దూషిస్తూ దాడికి కూడా దిగారు. దాడి తీవ్రతకు రేణుకా స్వామి తల నుండి రక్తం కారడం చూశాను. ఆ తర్వాత అక్కడికి పవిత్ర గౌడను పిలిపించి ఆమె చెప్పుతో కొట్టించారు. ఆ తర్వాత మరోసారి విచక్షణారహితంగా దాడి చేశారు అని ప్రదోష్‌ చెప్పారు.

కాసేపటి తర్వాత రేణుకా స్వామి లోదుస్తులు మాత్రమే ఉంచి టాటా ఏస్‌కు వేలాడదీశారు. నైలాన్‌ తాడుతో కొట్టారు. ఇంత దారుణంగా దాడి చేస్తే రేణుకాస్వామి చనిపోతాడని నేను వారించాను. అయినా నా మాటలు అక్కడున్నవారు పట్టించుకోలేదు. అయితే కాసేపటికి రేణుకా స్వామికి ఫుడ్‌ పెట్టి ఆ తర్వాత అతడి ఛాతీ, మెడపై కాలితో దర్శన్‌ గట్టిగా తన్నారు. దాంతో రేణుకా స్వామి స్పృహ తప్పి కిందపడిపోయాడు. బాధితుడి ఛాతీపై దర్శన్‌ తన కాళ్లతో నిలబడి తొక్కేందుకు ట్రై చేశాడు అని వివరించారు.

వెంటనే తాను జోక్యం చేసుకుని పక్కకు లాగానని, రేణుకాస్వామి చనిపోయినట్లు గుర్తించిన తర్వాత ఈ విషయాన్ని సద్దుమణిగేలా చేయమని దర్శన్‌ తనను అడిగారని. లేకపోతే తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించారని కూడా చెప్పారు. దాంతో అసలు విషయాన్ని దాచిపెట్టి కల్పిత కథను సృష్టించడానికి చర్చలు జరిగాయి అని ప్రదోష్‌ తన పిటిషన్‌లో రాసుకొచ్చాడు. ఇదంతా చెప్పిన తర్వాత తన రక్షణ కోసం జైలులో తనను ప్రత్యేక సెల్‌లో ఉంచాలని ప్రదోష్‌ విజ్ఞప్తి చేశాడు.

నయన్‌ vs నయనతార… రెండ్రోజుల గ్యాప్‌లో బాక్సాఫీసు దగ్గర సందడి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus