మన సినిమాలో తమిళనాడులో రిలీజ్ అయితే… ‘ఏదో సినిమా వచ్చింది’ అనే ఫీల్ ఉంటుంది. అదే సమయంలో మనం మాత్రం తమిళ హీరోలను ‘ఓన్’ చేసేసుకుంటాం. అంత విశాలమైన మనసు మనది. తాజాగా మన నిర్మాతలు తమిళ హీరోలను ఓన్ చేసేసుకుంటున్నారు. వరుసగా అవకాశాలు ఇచ్చిన బైలింగ్వుల్, మల్టీ లింగ్వుల్ సినిమాలు తీసేందుకు సిద్ధమవుతున్నారు. అలాంటి వారిలో ధనుష్ ఒకడు. తమిళంలో గత కొన్నేళ్లుగా సరైన హిట్ లేని ధనుష్ ఇప్పుడు తెలుగులోకి ఎందుకొస్తున్నట్లు.
ప్రస్తుతం ధనుష్ వరుసగా తెలుగు సినిమాలు చేసే పనిలో ఉన్నాడా? ఆయన జోరు చూస్తుంటే అలానే అనిపిస్తోంది. మొన్నటిమొన్న శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ సినిమా అనౌన్స్ అయ్యింది. వెంకీ అట్లూరి కూడా ధనుష్కి ఓ కథ వినిపించినట్లు సమాచారం. ‘సాహో’తో బోల్తాపడ్డ సుజీత్ కూడా ధనుష్ కోసం ఓ కథ సిద్ధం చేశాడట. ఈ రెండూ ఓకే అయితే ధనుష్ నుండి టాలీవుడ్లో వరుసగా మూడు సినిమాలు వస్తాయి.
ధనుష్ విన్న ఆ రెండు కథలను ఓకే చేసేస్తే… కనీసం రెండేళ్ల పాటు ఇక్కడే ఉండిపోవాల్సి వస్తుంది. అంటే చెన్నై వెళ్లిరాడని కాదు. టాలీవుడ్లో వరుసగా డేట్స్ ఇవ్వాల్సి వస్తుందని మా ఆంతర్యం. ఇటీవల కాలంలో ధనుష్ సినిమాలను డబ్బింగ్ చేసి విడుదల చేసినా… తెలుగులో సరైన ఫలితాలు, వసూళ్లు సాధించింది లేదు. అలాంటిది ఇప్పుడు ధనుష్ కోసం దర్శకులు, నిర్మాతలు వరుస కట్టడం వెనుక ఆంతర్యం ఏంటో తెలియడం లేదు.