ఇస్మార్ట్ శంకర్ తో పూరీ జగన్నాధ్ రియల్ బ్లాక్ బస్టర్ టేస్ట్ చేశాడా ?

  • July 24, 2019 / 03:19 PM IST

అది 2000 సంవత్సరం. పవన్ కళ్యాణ్ అనే సునామీ సినీ పరిశ్రమను వణికిస్తున్న తరుణం. అలాంటి సునామీతో “బద్రి” చిత్రం తీసి హీరో యాటిట్యూడ్ ఇలా ఉంటుందా? అని జనాలందరూ ఆశ్చర్యపోయేలా చేసిన దర్శకుడు పూరీ జగన్నాధ్. సినిమా మొత్తంలో హీరోయిన్స్ ఎక్స్ పోజింగ్ ఉండదు, డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉండవు. 2002లో మళ్ళీ “ఇడియట్” అనే సినిమాతో కుర్రాళ్ళు ప్రేమిస్తే ఇలాగే ఉంటుందేమో అని ప్రేక్షకులు కన్విన్స్ అయిపోయి “చంటిగాడు లోకల్” అని కేకలు పెట్టిన తరుణం అది. ఇక 2006లో “పోకిరి”తో పూరీ క్రియేట్ చేసిన, కొల్లగొట్టిన రికార్డుల సంఖ్య ఇప్పటికీ ఓ రికార్డే. మళ్ళీ 2012లో “బిజినెస్ మ్యాన్”లో మిల్క్ బాయ్ మహేష్ బాబును నెగిటివ్ షేడ్ ఉన్న హీరోగా ఆడియన్స్ కు పరిచయం చేసి పిచ్చెక్కించాడు పూరీ.

ఇక 2015లో పూరీ “టెంపర్” సినిమాలో ఎన్టీఆర్ నట ప్రతిభను సరికొత్తగా ప్రపంచానికి పరిచయం చేసిన తీరుని ఎన్టీఆర్ అభిమానులు మాత్రమే కాదు తెలుగు సినిమా అభిమానులు కూడా ఇప్పటికీ, ఎప్పటికీ మర్చిపోలేదు. ఈ సినిమాలన్నీ పూరీని స్టార్ డైరెక్టర్ గా మాత్రమే మార్చలేదు. జనాల హృదయాలకు దగ్గర చేశాయి. దాసరి నారాయణ రావు తర్వాత ఒక దర్శకుడిగా పబ్లిక్ లో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకొన్న ఏకైక దర్శకుడు పూరీ జగన్నాధ్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇంతటి అమోఘమైన చరిత్ర కలిగిన పూరీ జగన్నాధ్ “ఇస్మార్ట్ శంకర్” అనే ఒక సాధారణ సినిమా సాధించిన హిట్ కి పండగలు చేసుకోవడం ఆయన వీరాభిమానులకు రుచించడం లేదు. పోనీ ఈ సినిమాతో పూరీ దర్శకుడిగా ఏమైనా నిరూపించుకొన్నాడా అంటే అదీ లేదు. కేవలం మాస్ ఎలిమెంట్స్, ఫైట్స్, హీరోయిన్స్ ను డిఫరెంట్ యాంగిల్స్ లో ఎక్స్ ఫోజ్ చేయించి.. మాస్ ఆడియన్స్ ను అలరించి కోట్లు కొల్లగొడుతున్నాడు. సినిమా మూల కథ కూడా ఓ హాలీవుడ్ సినిమా నుంచి స్పూర్తి పొంది రాసుకొన్నది. పూరీ రేంజ్ కి “ఇస్మార్ట్ శంకర్” విజయం అనేది పెద్ద ఎగిరెగిరి పడాల్సిన విషయం కాదు. ఈ విషయం ఆయన ఎంత త్వరగా అర్ధం చేసుకొని.. మళ్ళీ పాత పూరీ జగన్నాధ్ లా “పోకిరి, ఇడియట్, బిజినెస్ మ్యాన్, బద్రి” లాంటి ఒరిజినల్ బ్లాక్ బస్టర్ తీస్తాడో అప్పుడే నిజమైన పూరీ అభిమాని కాలర్ ఎగరేయగలడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus