శర్వానంద్ హీరోగా వచ్చిన ‘శతమానం భవతి’ చిత్రం ఎంత పెద్ద హిట్టయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ చిత్రానికి ఏకంగా నేషనల్ అవార్డు రావడంతో దర్శకుడు సతీశ్ వేగేశ్న పేరు మార్మోగింది. అటు తరువాత ఆయన ‘శ్రీనివాస కళ్యాణం’ ‘ఎంత మంచి వాడవురా’ వంటి కుటుంబ కథా చిత్రాలను తెరకెక్కించాడు. అయితే ఇప్పుడు తన పంధా మార్చుకుని పూర్తి వినోదాత్మకంగా సాగే యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ‘కోతికొమ్మచ్చి’ అనే డిఫరెంట్ టైటిల్ తో ఈ చిత్రం తెరకెక్కనుంది. దివంగత నటుడు రియల్ స్టార్ శ్రీహరి కొడుకు మేఘాంశ్ అలాగే సతీశ్ వేగేశ్న కొడుకు సమీర్ ఈ చిత్రంలో హీరోలుగా నటిస్తున్నారు.
రిద్దికుమార్, మేఘా చౌదరి వంటి క్రేజీ భామలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్, నరేష్ వంటి స్టార్లు కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తూండటం మరో విశేషం.2 నెలల వ్యవధిలోనే షూటింగ్ ను కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఆధ్యంతం నవ్వించే విధంగానే ఈ చిత్రం ఉంటుందట. ‘ఈ కరోనా టైములో తమ సినిమాని చూడడానికి వచ్చే ప్రేక్షకులను మనస్ఫూర్తిగా నవ్వించి ఇంటికి పంపడమే లక్ష్యంగా ‘కోతి కొమ్మచ్చి’ ని తెరకెక్కిస్తున్నట్టు’ దర్శకుడు సతీశ్ వేగేశ్న హామీ ఇస్తున్నాడు.
అందుకు తగినట్టుగానే ప్రమోషన్స్ ను కూడా భారీ స్థాయిలో నిర్వహించడానికి చిత్ర యూనిట్ సభ్యులు రెడీ అయ్యారు. ఇందులో భాగంగా శుక్రవారం(రేపు) ఉదయం 9.30కి మూవీ థీమ్ సాంగ్ ను సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ ‘దిల్’ రాజు చేతులు మీదుగా ఆవిష్కరించనున్నారు. అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. ఇక థీమ్ సాంగ్ కూడా చాలా బాగా వచ్చిందని వినికిడి. సినిమా పై హైప్ పెంచేలానే ఈ పాట ఉండబోతుందట.