‘దేవర’ (Devara) సినిమా ఏ స్థాయిలో ఉందో మీరు చూశారు.. ‘దేవర 2’ అంతకుమించిన స్థాయిలో ఉంటుంది అని అంటున్నారు కొరటాల శివ. సినిమా ఎప్పుడు మొదలవుతుంది, ఎప్పుడు ఉంటుంది అనే విషయంలో ఇప్పటివరకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు కానీ.. సినిమా ఎవరూ ఊహించని స్థాయిలో ఉంటుంది అని మాత్రం చెప్పేశారు. దీనికి సంబంధించి ఆయన చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కొరటాల శివ (Koratala Siva) – ఎన్టీఆర్ (Jr NTR) కాంబినేషన్‌లో వచ్చిన సినిమా ‘దేవర’.
జాన్వీ కపూర్ (Janhvi Kapoor) , సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) ఇతర ముఖ్య పాత్రల్లో నటించిన ఆ సినిమా ఊహించని విజయం అందుకుంది అని చెబుతున్నారు. తొలి వారాంతంలో భారీ వసూళ్లు అందుకున్న ఈ సినిమా వసూళ్ల విషయంలో ఆ తర్వాత ఊహించని రీతిలో పడిపోయింది అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో సినిమా గురించి వరుస ఇంటర్వ్యూలు, విషయాలు బయటకు వస్తున్నాయి. ‘దేవర 2’లో జాన్వీ కపూర్ పాత్ర అసాధారణంగా ఉంటుందని గతంలో ఓసారి చెప్పిన టీమ్..
ఆమె పాత్ర చూశాక ఆశ్చర్యపోతారని హైప్ ఇస్తోంది. మొదటిభాగం కంటే రెండో భాగంలో ఆమె పవర్‌ఫుల్‌గా ఉంటుందని అంటున్నారు. అలాగే కథలో అసలు మలుపులు పార్ట్ 2లోనే ఉంటాయని చెబుతున్నారు కొరటాల శివ. ‘దేవర 1’లో మీరు చూసింది 10 శాతం మాత్రమేనని, రెండో భాగంలో వందకు వంద శాతం చూస్తారని కొరటాల మాటిస్తున్నారు. ఇటీవల ఎన్టీఆర్ కూడా ‘దేవర 2’ గురించి ఇలానే చెప్పారు.
‘దేవర 1’ షూటింగ్ సమయంలోనే రెండో ‘దేవర’ సన్నివేశాలు షూట్ చేశామని తెలిపారు. ఆ లెక్కన ‘దేవర’ కంటే సీక్వెల్ ఇంకా బాగుంటుందని తారక్ అన్నాడు. అయితే కథ సిద్ధంగా ఉందని.. కొన్ని మెరుగులు అవసరం అని చెప్పాడు. అంటే ‘దేవర 2’ కథకు టింకరింగ్‌లు వేసి ఫైనల్ చేయాలి. ఈజీగా చెప్పాలంటే ‘పుష్ప: ది రూల్’ (Pushpa 2) విషయంలో సుకుమార్ (Sukumar) అండ్ కో. చేసినట్లుగా అన్నమాట.