‘పుష్ప: ది రూల్’ (Pushpa 2) సినిమా రిలీజ్ ఎప్పుడు అంటే.. ఇదిగో డిసెంబరు 6న సినిమా టీమ్ చెబుతూనే ఉంది. అందుకు తగ్గట్టుగానే నిద్రాహారాలు మానుకొని మరి సినిమా టీమ్ క్లయిమాక్స్ చిత్రీకరణలో బిజీగా ఉంది. రామోజీ ఫిలిం సిటీలో వేసి సెట్స్, ఇండోర్‌లో సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. అయితే తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం చూస్తే.. సినిమా డిసెంబరు 6న వచ్చే అవకాశం లేదు అని చెబుతున్నారు. అలా అని, సినిమా వాయిదా పడింది అని బాధపడొద్దు.
ఎందుకంటే సినిమాను ఒక రోజు ముందుగానే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని సుకుమార్ (Sukumar) అండ్ కో. ప్లాన్ చేస్తున్నారట. ఈ మేరకు సినిమా టీమ్ ఫైనల్ అవుట్‌పుట్‌ని రెండు రోజుల ముందే సిద్ధం చేసి క్యూబ్‌కి పంపించే ప్లాన్‌లో ఉన్నారట. తొలి ‘పుష్ప’ తరహాలో ఆఖరి వరకు ఉండి, ఉంచి ఇబ్బందిపడకుండా ముందుగానే రెడీ చేస్తారట. ఆ లెక్కన డిసెంబరు 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట. లాంగ్ వీకెండ్‌ను వినియోగించుకునే ఉద్దేశంతోనే ‘పుష్ప’ టీమ్ ప్లాన్ చేస్తోందట.
ప్రస్తుతం ఎంత పెద్ద సినిమా అయినా, ఎంత మంచి టాక్ వచ్చినా వీకెండ్ తర్వాత ఆ స్థాయి వసూళ్లు రావడం లేదు. అందుకే గురు, శుక్ర, శని, ఆదివారాలను వాడుకుని భారీ వసూళ్లకు ప్లాన్‌చేస్తున్నారట. ఆ లెక్కన ఈ న్యూస్ ఫ్యాన్స్‌కి హ్యాపీన్యూసే. అయితే ఒక్కటే డౌట్. సినిమా షూటింగ్ అయిపోతోందా? ప్రచారానికి సమయం ఉంటుందా? అని.
ఎందుకంటే పోస్ట్ ప్రొడక్షన్ విషయంలో సుకుమార్ చాలా సమయం తీసుకుంటారని ఓ టాక్ ఉంది బయట. ఇప్పుడు చూస్తే అక్టోబరు 8 వచ్చేసింది. అంటే గట్టిగా రెండు నెలలు లేదు. ఎప్పుడు షూటింగ్ పూర్తి చేస్తారు? ఎప్పుడు ప్రచారం చేస్తారు అనేదే డౌట్. ఈ లోపు ప్రీపోన్ అనే వార్తలు వస్తున్నాయి. లెక్కల మాస్టారి లెక్కలేంటో ఆయనకే తెలియాలి.