ప్రముఖ దర్శకుడు క్రిష్ సినిమాల్లోనే కాదు.. నిజ జీవితంలోను క్రియేటివిటీని అప్లై చేశారు. ఈ డైరక్టర్ నగరానికి చెందిన వైద్యురాలు రమ్యను ఈ నెల 7 న పెళ్లి చేసుకోబోతున్నారు. కల్యాణ ఆహ్వాన పత్రికను విభిన్నంగా రాసి క్రిష్ తన అభిరుచిని చాటుకున్నారు. “నిజానికి స్వర్గంలోని పెళ్లి చేసేసి భూమ్మీదకు పంపిస్తాడంట భగవంతుడు.. అక్కడేవారిని చేసుకున్నానో నిన్న మొన్నటి దాకా గుర్తురాలేదు.. వెలగ వెంకట రమణ ప్రసాద్ గారని, వాళ్ళమ్మాయిని చూశాను.
స్వర్గంలో జరిగిన పెళ్లంతా కళ్లకి కట్టినట్టు కనిపించేసింది.. ఆ అమ్మాయిని నేనిప్పుడు చేసుకుంటా.. పేరు రమ్య..” అంటూ ఆహ్వాన పత్రికలో క్రిష్ రాసిన విధానం అందరికీ భలే నచ్చింది. బంధువులను పిలవడంలో కూడా ప్రత్యేకత చూపించారు. “దేవతలే బంధువుల్లా వస్తారంటా.. మీరొస్తే ఒక దేవతొచ్చినట్టే .. మీ కోసం మీ ఆశీస్సుల కోసం వేదం మంత్రాలూ కూడా వేయి కళ్లతో ఎదురు చూస్తుంటాయని మర్చిపోకండి.” అంటూ పక్కన నిలబడి ప్రేమగా పిలిచినట్లు రాసారు. ఇది చదివిన వారెవరైనా పెళ్ళికి వెళ్లకుండా ఉండలేరు.
గండిపేట ఉస్మాన్ సాగర్ లేక్ దగ్గర గోల్కొండ రిసార్ట్ లో జరిగే క్రిష్, రమ్యల పెళ్లికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులతో పాటు సినీ ప్రముఖులు హాజరుకానున్నారు. పెళ్లి పనుల కోసం తను డైరక్ట్ చేస్తున్న బాలకృష్ణ వందవ చిత్రం గౌతమి పుత్ర శాతకర్ణి షూటింగ్ కి కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చారు. కళ్యాణం అనంతరం చిత్రీకరణ కొనసాగుతుంది.