సాధారణమైన వారిని స్టార్స్ చేయడం ఒకరికి ఇష్టం.. స్టార్స్ తో హిట్ కొట్టడం మరొకరికి ఇష్టం.. మొదటి వర్గానికి చెందిన డైరక్టర్ శేఖర్ కమ్ముల. పద్దెనిమిదేళ్ల క్రితమే మెగా ఫోన్ పట్టిన ఈ డైరక్టర్ ఎక్కువశాతం కొత్తవారితోనే సినిమాలు చేశారు. ఆనంద్, హ్యాపీడేస్ వంటి మంచి సినిమాలను అందించారు. భల్లాల దేవుడు రానాని కూడా ‘లీడర్’ సినిమాతో పరిచయం చేసింది ఇతనే. అంతేకాదు అర్జున్ రెడ్డి హీరో విజయ్ దేవరకొండ కూడా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రంలో నటించారు. మెగా హీరో వరుణ్ తేజ్ మంచి హిట్ కోసం తపిస్తున్న సమయంలో ఫిదా వంటి సూపర్ హిట్ ఇచ్చారు.
ఈ సినిమాతోనే మళ్ళీ శేఖర్ కమ్ముల హిట్ ట్రాక్ లోకి వచ్చారు. ఈసారి ఏ యువ హీరోతో సినిమా చేస్తారని అందరూ ఎదురుచూస్తుంటే.. అతను మాత్రం స్టార్ హీరోతోనే సినిమా చేయడానికి ఫిక్స్ అయ్యారంట. అతనే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసినట్లు ఫిలిం నగర్ వాసులు చెప్పారు. భారీ యాక్షన్ సినిమాల్తో బన్నీ ఈ మధ్య వరుసగా అపజయాలను మూటగట్టుకున్నాడు. ఈసారి ఫీల్ గుడ్ మూవీతో విజయాన్ని అందుకోవాలని శేఖర్ కమ్ములతో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాలీవుడ్ వర్గాలు తెలిపాయి. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.