సోషల్ మీడియా వ్యసనంగా మారింది!

కథానాయకుడు విజయ్ దేవరకొండకు నాకు మధ్య ఎలాంటి సమస్యలు లేవు. ప్రస్తుతం ఇతర చిత్రాల షూటింగ్‌లతో బిజీగా వుండటం వల్ల ఆయన ఈ చిత్ర ప్రచారానికి రావడం లేదు. విజయ్ మాకు ఎల్లప్పుడూ అన్ని విధాలా సహకరించాడు. ఆయనతో సినిమా చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు శ్రీధర్ మర్రి. ఆయన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ఏ మంత్రం వేసావే. విజయ్ దేవరకొండ, శివానీ సింగ్ జంటగా నటించిన ఈ చిత్రం నేడు రీలీజ్ అవుతున్నది. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీధర్ మర్ని గురువారం హైదరాబాద్‌లో పాత్రికేయులతో ముచ్చటించారు.

నేపథ్యం..

చిన్నతనం నుంచి సినిమాలతో పాటు స్టోరీస్ అంటే చాలా ఆసక్తి వుండేది. ఊహ తెలిసిన దగ్గరి నుంచే కథలు రాయడం అలవాటుగా మారింది. నా స్వస్థలం హైదరాబాద్. అయితే మా కుటుంబం కొన్ని కారణావల్ల బెంగళూరులో స్థిరపడింది. ఇంజీనీరింగ్ పూర్తి చేసిన తరువాత మాస్టర్స్ ఇన్ ఇండస్ట్రీయల్ డిజైన్ చేశాను. ఆ తరువాత కోల్‌కొతాలో ఐఏఎమ్ చేశాను. ఇన్ఫోసిస్‌లో వైస్‌ప్రెసిడెంట్‌గా 15 ఏళ్లు పనిచేశాను. నేనున్న రంగం వేరు కావడంతో సినిమా రంగంవైపు దృష్టి సారించలేకపోయాను. అయితే కెరీర్‌లో స్థిరపడిన తరువాత సినిమా చేయాలనే కోరికను నెరవేర్చుకోవాలనే సంకల్పంతో సినిమా చేయాలని ఓ కథ రాసుకున్నాను. అదే ఏ మంత్రం వేసావే.

సోషల్ మీడియా పిచ్చిలో..

మన చుట్టూ నిత్యం జరిగే సంఘటనలను తీసుకుని కథ చేసుకున్నాను. మన చుట్టూ వున్న వాళ్లతో కాకుండా ప్రతీ ఒక్కరు నిత్యం సెల్‌ఫోన్‌లో మునిగితేలుతున్నారు. ఈ పిచ్చిలో ప్రతీ చిన్న విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం మొదలైంది. ప్రాఫిట్ మోజులో సోషల్ మీడియా కంపెనీలు జనాలని ఏ స్థాయికి దిగజారుస్తున్నారో వాళ్లు పట్టించుకోవడం లేదు. సోషల్ మీడియా మోజులో భావోద్వేగాల్ని, బంధాల్ని మర్చిపోవడం వేలం వెర్రిగా మారింది. దీన్నే ప్రధాన ఇతివృత్తంగా చేసుకుని యూత్‌కు చెప్పాలనుకున్నాను. అయితే ఇది రెగ్యులర్‌గా సాగే సినిమా కాదు.
మార్పులు చేయలేదు..

పెళ్లిచూపులు చిత్రానికి ముందే విజయ్ దేవరకొండకు ఈ కథ చెప్పాను. ఇలాంటి కథతో రిస్క్ చేయడానికి ఏ నిర్మాత ముందుకురాడని గ్రహించి స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని రూపొందించాను. ఉద్యోగం చేస్తూ సినిమా చేయడం వల్ల కొంత ఆలస్యమైంది. ఈ సమయంలోనే విజయ్ చేసిన పెళ్లిచూపులు, అర్జున్‌రెడ్డి చిత్రాలు సూపర్‌హిట్ అయ్యాయి. వాటి ఫలితాల్ని దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రంలో ఎలాంటి మార్పులు చేయలేదు. గత చిత్రాలకు ఏ మాత్రం సంబంధం లేని విధంగా చాలా భిన్నంగా విజయ్ దేవరకొండ పాత్ర వుంటుంది. అందుకే ఆ చిత్రాలతో పోల్చోద్దు అంటున్నాను.విభిన్నమైన పాత్రల్లో నటించేలా నటులకు ప్రేక్షకులు స్వేచ్ఛనివ్వాలి. లేదు ఒకే తరహా పాత్రల్లో చూస్తాం అనడం తప్పు. అమీర్‌ఖాన్ దంగల్ సినిమా తరువాత మళ్లీ అదే తరహా సినిమా చేస్తానంటే కుదరదు కదా. కొత్త తరహా కథలు చేస్తేనే నటుడనే వాడి కెరీర్ ఫుల్‌ఫిల్ అవుతుంది. ఇక ఈ సినిమా పూర్తయిన తరువాత చాలా మంది డిస్ట్రిబ్యూటర్‌లను సంప్రదించాను. కానీ ఎవరూ దీన్ని విడుదల చేయడానికి ఆసక్తిని కనబరచలేదు. ఆ సమయంలో ఈ చిత్ర కథ నచ్చి ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి మల్కాపురం శివకుమార్ ముందుకొచ్చారు. మా మధ్య ఎలాంటి సమస్యలు లేవు..

హీరో విజయ్‌కి నాకు మధ్య ఎలాంటి సమస్యలు లేవు.

ప్రస్తుతం ఇతర చిత్రాల షూటింగ్‌లతో బిజీగా వుండటం వల్ల ఆయన ఈ చిత్ర ప్రచారానికి రావడం లేదు అంతే. డబ్బు కోసమే నేను చిత్రపరిశ్రమకు రాలేదు. అర్థవంతమైన చిత్రాలకే నా ప్రాధాన్యత. నా దగ్గర చాలా కథలున్నాయి. ఈ సినిమా తరువాత రిలీజ్ తరువాత ఓ కొత్త తరహా కథతో తదుపరి చిత్రానికి శ్రీకారం చుడతాను.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus