కొన్నేళ్ల క్రితం వరకు వరుస విజయాలు సాధించి స్టార్ డైరెక్టర్ గా శ్రీను వైట్ల ఒక వెలుగు వెలిగారు. మహేష్ బాబు శ్రీనువైట్ల కాంబినేషన్ లో తెరకెక్కిన దూకుడు బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవగా బాద్ షా సినిమాతో మరో బ్లాక్ బస్టర్ సాధించిన శ్రీనువైట్ల ఆ సినిమా తర్వాత దర్శకత్వం వహించిన ఆగడు, బ్రూస్ లీ, మిస్టర్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్లుగా నిలిచాయి. ప్రస్తుతం ఈ డైరెక్టర్ మంచు విష్ణుతో డి అండ్ డి సినిమాను తెరకెక్కించడానికి సిద్ధమవుతున్నారు.
లాక్ డౌన్ సమయంలో మూడు కథలు సిద్ధం చేశానని త్వరలోనే డి అండ్ డి షూటింగ్ ప్రారంభం కానుందని శ్రీనువైట్ల తెలిపారు. డి అండ్ డి సినిమాకు ఢీ సినిమాతో చిన్న కనెక్షన్ ఉంటుందని ప్రస్తుతం వెండితెర లక్ష్యంగానే సినిమాలను తెరకెక్కిస్తున్నానని శ్రీనువైట్ల అన్నారు. వెబ్ సిరీస్ లు చేయాలనే ఆలోచన మాత్రం ఎప్పుడూ రాలేదని శ్రీనువైట్ల చెప్పుకొచ్చారు. ఆగడు, బ్రూస్ లీ, మిస్టర్ ఫ్లాప్ కావడం గురించి మాట్లాడుతూ టైమింగ్ కు తగ్గ కథలు అందించలేదని అందువల్లే కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయని శ్రీనువైట్ల అన్నారు.
ఇప్పటివరకు తాను ఏ సినిమాను రీమేక్ చేయలేదని ఆసక్తికరమైన స్క్రిప్ట్ అనిపిస్తే మాత్రం భవిష్యత్తులో రీమేక్ చేసే అవకాశాలు ఉన్నాయని శ్రీనువైట్ల తెలిపారు. మంచి సినిమా, వినోదాత్మకంగా ఉండే సినిమా చేయాలని అనుకుంటున్నానే తప్ప చిన్న సినిమా, పెద్ద సినిమా అనే ఆలోచనలు లేవని శ్రీనువైట్ల వెల్లడించారు. ట్రెండ్ మారిపోయిందని భావించి చేసిన పొరపాట్ల వల్లే కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయని శ్రీనువైట్ల చెప్పుకొచ్చారు. డి అండ్ డి సినిమాతో సక్సెస్ సాధించి కథల విషయంలో చేసిన తప్పులను శ్రీనువైట్ల సరిదిద్దుకుంటారో లేదో చూడాల్సి ఉంది.