పెళ్లి అంటే నమ్మకంపై మాత్రమే నిలబడే బంధం. అంటే ఆ తంతు నిజాయితీగా జరగాలి. ఆ నిజాయితీ జీవితాంతం ఉంటుందనే నమ్మకం ఉన్నప్పుడే ఏ పెళ్లి బంధమైనా ఆనందంగా కొనసాగుతుంది. అబద్ధపు పెళ్లిల్లలో ఆడంబరం ఉంటుంది. కానీ ఆనందం ఉండదు అనే అంశం చుట్టూ తిరిగే కథాంశంతో రూపొందుతోన్న సినిమా ‘‘శుభలేఖ+లు’’. ఈ మూవీ టైటిల్ నుంచి.. ఆ మధ్య విడుదల చేసిన టీజర్, ఫస్ట్ వీడియో సాంగ్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి రెండో వీడియో పాటను స్టార్ డైరెక్టర్ వివి వినాయక్ చేతుల మీదుగా విడుదల చేశారు. ‘శృంగారాలహరీ శృతజన శుభకరీ సౌందర్యలహరీ’ అంటూ అచ్చ తెలుగు పదాలతో సాగే ఈ పాటపై వినాయక్ ప్రశంసల వర్షం కురిపించాడు.
కెఎమ్ రాధాకృష్ణన్ సంగీతం అందించిన ఈ పాట ట్యూన్ వినగానే ఆకట్టుకునేలా ఉంది. ఈ సినిమాకు కెఎమ్ రాధాకృష్ణ సంగీతం ఓ హైలెట్ గా నిలుస్తుందని దర్శక, నిర్మాతలు ముందు నుంచీ చెబుతున్నారు. అందుకు తగ్గట్టుగానే ఇప్పుడీ రెండో వీడియో సాంగ్ విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇప్పటి వరకూ ఈ సినిమాకు సంబంధించి ప్రతి విషయంలోనూ పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి. వాటిని ఈ పాట రెట్టింపు చేసింది. చాలా ఇన్నోవేటివ్ కథాంశంతో రూపొందుతోన్న ఈ చిత్రంతో శరత్ నర్వాడే దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ‘‘శుభలేఖ+లు’’చిత్రానికి సంబంధించి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. సినిమాను సెప్టెంబర్ లో విడుదల కాబోతోంది.