ప్రముఖ టాలీవుడ్ సినిమాల డిస్ట్రిబ్యూటర్ నెల్లూరు హరి అలియాస్ గుజ్జలపూడి హరికుమార్ కన్నుమూశారు. 43 ఏళ్ల హరి కుమార్.. తెలుగు చిత్ర పరిశ్రమలో నెల్లూరు హరిగా సుపరిచితులు. ఆయన ఆదివారం హైదరాబాద్‌లో గుండెపోటుతో మృతిచెందారు. హరి పిక్చర్స్ అనే సంస్థను నిర్వహిస్తూ హరి కుమార్ నెల్లూరు జిల్లాతోపాటు, ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో 400కిపైగా సినిమాల్ని పంపిణీ చేశారు. దాంతోపాటు కొన్ని అనువాద చిత్రాలను కూడా విడుదల చేశారు.
కుటుంబంతో కలసి హైదరాబాద్‌కు వచ్చిన హరి ఓ హోటల్‌లో ఉండగా గుండెపోటుతో కన్నుమూశారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. టాలీవుడ్ సినిమా పరిశ్రమలోని అగ్ర నిర్మాతలు, దర్శకులు, కథానాయకులతో ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి. హరి మృతదేహాన్ని ఆయన స్వస్థలమైన నెల్లూరుకి తరలించారు. హరి మృతికి టాలీవుడ్‌కి చెందిన పలువురు ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.
హరి డిస్ట్రిబ్యూషన్‌కు మాత్రమే కాదు.. నిర్మాణ రంగంలోనూ తన ప్రయత్నం చేశారు. విశాల్, తమన్నా జంటగా నటించిన ‘ఒక్కడొచ్చాడు’ సినిమాను తెలుగులో విడుదల చేశారు. నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి భాగస్వామ్యంలో హరి కొన్ని సినిమాలు చేశారు. అలాగే దిల్ రాజు సినిమాలను ఏపీలో ఎక్కువగా డిస్ట్రిబ్యూట్ చేశారు. నెల్లూరు హరి డిస్ట్రిబ్యూట్ చేసిన సినిమాల్లో రీసెంట్‌గా ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా భారీ విజయం సాధించింది. ఆయనకు కూడా పెద్ద మొత్తంలో లాభాలు తెచ్చిపెట్టింది అని చెబుతున్నారు.