మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక చిత్రం కత్తిలాంటోడు షూటింగ్ కు మరో అంతరాయం కలిగింది. ఎన్నో చిక్కులను దాటుకుని చిరు 150 వ సినిమా చిత్రీకరణ హైదరాబాద్లోని ఓ ఇంట్లో గురువారం మొదలైన సంగతి అందరికీ తెలిసిందే. మెగాస్టార్ తొలి రోజు షూటింగ్ చిత్రాలు సోషల్ మీడియాలో విహారం చేశాయి. కత్తిలాగా ఉన్నాడని చిరు అభినందనలు కూడా అందుకున్నారు.
శుక్రవారం రాత్రి కూకట్ పల్లి ప్లై ఓవర్ పై షూటింగ్ ప్లాన్ చేశారు. శుక్రవారం సాయంత్రం సునీల్ తాజా చిత్రం జక్కన్న ఆడియో వేడుకకు చిరు హాజరై, తన మూవీ షూటింగ్ స్పాట్ కి వెళ్లారు. అప్పటికే మేఘావృతమై ఉన్న ఆకాశం సన్నని చినుకుల రూపంలో వర్షిస్తోంది. చినుకులు ఆగిపోతుందని భావించిన చిత్ర యూనిట్ కి ఎదురు దెబ్బ తగిలింది. వేగంగా గాలులు వీయడంతో ప్లై ఓవర్ కు ఆనుకుని ఉన్న హోర్డింగ్ లు కూలాయి.
అక్కడవున్న వాహనాలు దెబ్బతిన్నాయి. ప్రాణ నష్టం ఏమి జరగక పోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిచి పోయింది. వాన ఎక్కువైంది. దీంతో ఆ రోజు షూటింగ్ కి దర్శకుడు వి.వి.వినాయక్ ప్యాక్ అప్ చెప్పారు. కొణెదల ప్రొడక్షన్, లైకా ప్రొడక్షన్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ నేడు కొనసాగుతుంది. వర్షం రాకుండా ఉంటే కూకట్ పల్లి ప్లై ఓవర్ పై కొన్ని యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించనున్నారు.