టాలీవుడ్లో ఓ హీరోకు ఓ ఇమేజ్ వచ్చింది అంటే.. అతను రిటైర్ అయ్యేంతవరకు అదే ఇమేజ్ ఉండిపోవాలి. ఈ మాట మేం అనడం లేదు. ఆ హీరోలే వివిధ సందర్భాల్లో చెప్పారు. చాక్లెట్ బాయ్, లవర్ బాయ్, మాస్ హీరో, మాస్ స్టార్.. ఇలా ఏవేవో పేర్లు పెట్టేసి.. ఆ హీరో అలాంటి సినిమాలే చేయాలి అని ఫిక్స్ అయిపోతారు. దాంతో వాళ్ల ఇమేజ్ ఛట్రాన్ని దాటి వేరే జోనర్లో, ఇంకో ఇమేజ్ వచ్చే సినిమా చేస్తే తట్టుకోలేరు. దీంతో సినిమా ఫట్ మంటుంది.
ఇప్పుడు ఇదే భయంతో బాలయ్య ఓ పాన్ ఇండియా సినిమాలో వద్దు అని అంటున్నారు కొంతమంది అభిమానులు, నెటిజన్లు. ప్రముఖ నిర్మాత సి.కల్యాణ్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ త్వరలో బాలకృష్ణ హీరోగా ఓ సినిమా చేస్తామని చెప్పారు. ‘రామానుజాచార్య’ చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో బాలకృష్ణ ప్రధాన పాత్రలో నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఓ అంతర్జాతీయ సంస్థ, రవి కొట్టారకరతో కలసి చినజీయర్ స్వామి సహకారంతో ఈ ప్రాజెక్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం అని చెప్పారు. దీంతో ఒక్కసారి బాలయ్య కల్ట్ ఫ్యాన్స్ రియాక్ట్ అవ్వడం స్టార్ట్ చేశారు.
సోషల్ మీడియాలో చూస్తే.. ఈ మేరకు అప్పుడే పోస్ట్‌లు కనిపిస్తున్నాయి. బాలయ్య అంటే ఫుల్ మాస్ హీరో. అలాంటి కటౌట్‌తో రామానుజాచార్య సినిమా? వద్దు బాబోయ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మూడు డిజాస్టర్ల తర్వాత ‘అఖండ’తో బ్లాక్‌బస్టర్ అందుకున్న బాలయ్యను మళ్లీ ఇంకో వైపు తీసుకెళ్తే ఇబ్బంది అనేది ఆ ఫ్యాన్స్ (?) మాట. ‘వీర సింహారెడ్డి’, అనిల్ రావిపూడి సినిమా (‘బ్రో ఐ డోంట్ కేర్’ అనే టైటిల్ అనుకుంటున్నారు) లాంటి మాస్ సినిమాలు వస్తుండగా ఆ సినిమా ఎందుకు అని సి.కల్యాణ్‌ను అంటున్నారు.
అయితే బాలయ్య అభిమానుల్లో ఈ అసహనం వెనుక గతంలో వచ్చిన ఓ డిజాస్టర్ కూడా కారణమని చెబుతున్నారు. ‘సింహా’ సినిమాతో ఇండస్ట్రీ ఇచ్చిన బాలయ్యతో ‘పరమవీర చక్ర’ లాంటి ఆల్ టైం డిజాస్టర్ ఇచ్చిన నిర్మాత సి.కళ్యాణే. ఆ తర్వాత బాలయ్య ‘లెజెండ్’ సినిమాతో మళ్లీ ఫాం అందుకున్నాక.. ఇదే నిర్మాత ‘జైసింహా’, ‘రూలర్’ లాంటి ఫ్లాప్ సినిమాలు తీశారు. దీంతో సి.కల్యాణ్ అంటనే బాలయ్య ఫ్యాన్స్ భయపడుతున్నారు.