‘సౌత్ సినిమా ఎదుగుదలను బాలీవుడ్ మీడియా ఓర్చుకోలేకపోతుంది’ అనే అంశంపై దాదాపు 10 యేళ్ళ నుండి చర్చలు జరుగుతున్నాయి. ఛాన్స్ దొరికిన ప్రతిసారి సౌత్ సినిమాని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించడం బాలీవుడ్ మీడియాకి అలవాటే. ‘పెద్ది’ తో మరోసారి ఆ విషయం ప్రూవ్ అయ్యింది. రామ్ చరణ్ ‘పెద్ది’(Peddi) సినిమాలో హీరోయిన్ జాన్వీ కపూర్ ను అతి గ్లామరస్ గా చూపించారు అని కొందరు అంటుంటే.. సౌత్ సినిమాల్లో హీరోయిన్లను ఇలా తక్కువ చేసి చూపించడం షరా మామూలే అన్నట్టు బాలీవుడ్ మీడియా ప్రతినిధులు నీతులు చెబుతుండటం గమనార్హం.
అక్కడికేదో బాలీవుడ్ సినిమా హీరోయిన్లను పద్దతిగా చూపిస్తున్నట్టు..! వాస్తవానికి ఇండియన్ సినిమాకి గ్లామర్ ని పరిచయం చేసింది.. ఐటెం సాంగ్స్ సంస్కృతిని ప్రవేశపెట్టింది, బోల్డ్ కంటెంట్ పేరుతో అడల్ట్ కంటెంట్ ను చిత్రీకరించడం మొదలుపెట్టింది హిందీ సినిమానే కదా.!
ఇది జగమెరిగిన సత్యం కాదా? దశాబ్దాలుగా ఆ సంస్కృతిని పెంచి పోషించిన బాలీవుడ్.. ఇప్పుడు టాలీవుడ్ క్రియేటివిటీని ప్రశ్నించడం హాస్యాస్పదం అనే చెప్పాలి. కాకపోతే బాలీవుడ్ మీడియా చేసే విమర్శలకి భయపడి దర్శకుడు బుచ్చిబాబు సానా లాంటి వాళ్ళు క్షమాపనలు చెప్పాల్సిన అవసరం ఉందా? అంటే అస్సలు లేదు. కానీ ఆయన తన సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు చెప్పడంతో.. అక్కడి వాళ్ళు ఇంకా రెచ్చిపోతున్నారు.
సోషల్ మీడియా ట్రోల్స్‌కు, బాలీవుడ్ వర్గాల ఒత్తిడికి లొంగిపోయి, ‘పెద్ది’ సినిమాలోని సీన్లు కట్ చేశాడు బుచ్చిబాబు. అలా చేయడం వల్ల అతను తప్పుచేశాను అని ఒప్పుకున్నట్టే..! భవిష్యత్తులో అయినా మన ఫిల్మ్ మేకర్స్ గ్లామర్ సీన్స్ తీసేప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. తమ క్రియేటివిటీని నమ్ముకుని ఆ సీన్లు పెట్టినప్పుడు వెనకడుగు వేయకూడదు. ‘యానిమల్’ సినిమా విషయంలో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా పై ఇలాంటి ట్రోల్స్ ఎన్నో వచ్చాయి. కానీ ఆయన వెనకడుగు వేయలేదు. తనకి కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి.. ఏ నెగిటివ్ కామెంట్ కి భయపడలేదు.