కరోనా కారణంగా ఇండస్ట్రీలో రకరకాల పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కొందరు సినిమా షూటింగ్ లు ఆపేస్తుంటే.. మరికొందరు సినిమాలను కావాలనే చుట్టేస్తున్నారు. రీసెంట్ గా మొదలైన సినిమాలు.. రిలీజ్ డేట్ కి ఇంకా సమయం ఉన్న సినిమాలు.. కోవిడ్ కారణంగా షూటింగ్ లను ఆపేశాయి. మరికొన్ని సినిమాలు మాత్రం వీలైనంత త్వరగా షూటింగ్ లను పూర్తి చేయాలనే ఆలోచనతో.. చుట్టుడు కార్యక్రమం మొదలుపెట్టాయి. వీలైనంత తక్కువ మందితో షూటింగ్ చేయాలని నిర్మాతల మండలి షరతులు విధించిన సంగతి తెలిసిందే.
అంతతక్కువ మందితో షూటింగ్ జరపడం కష్టం కాబట్టి.. చాలా సినిమాల చిత్రీకరణ ఆగిపోయింది. ప్రస్తుతానికైతే.. షూటింగ్ లకు అనుమతి ఉంది. పూర్తిగా షూటింగ్ లకు బ్రేక్ పడకముందే సినిమాలను పూర్తి చేయాలనుకుంటున్నారు కొందరు నిర్మాతలు. ముఖ్యంగా ఓటీటీను టార్గెట్ చేసుకున్న కొన్ని సినిమాలు ఇప్పుడు తొందరగా షూటింగ్ లు పూర్తి చేయాలనీ చూస్తున్నాయి. ఒకేవేళ మళ్లీ లాక్ వచ్చి షూటింగ్ లు ఆపేస్తే.. అప్పుడు పరిస్థితి మరింత దారుణంగా మారుతుంది.
రీసెంట్ గా ఓ స్టార్ హీరో సినిమాను సైతం ఇలానే ముగించేయాలని షూటింగ్ వేగంగా చేస్తున్నారు. చివరికి సినిమాలో ఓ పాట, కొన్ని సన్నివేశాలను సైతం కత్తిరించేశారు. వాళ్ల టార్గెట్ ఈ నెలాఖరుకి షూటింగ్ ను పూర్తి చేయడమే. ఫ్యూచర్ లో ఎలాంటి భయంకరమైన రోజులు వస్తాయో చెప్పలేం. థియేటర్ లను ఇప్పట్లో రీ ఓపెన్ చేసే పరిస్థితి లేకపోతే.. ఓటీటీనే దిక్కు. కనీసం ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లకు సినిమాలను అమ్ముకుంటే పెట్టుబడి వస్తుందని నిర్మాతలు నమ్ముతున్నారు!