ఏదైనా పబ్లిక్ ఈవెంట్స్ లేదా సినిమా ఈవెంట్స్..కి హీరోయిన్లు గ్లామర్ గా రెడీ అయ్యి వెళ్లడం అనేది ఆనవాయితీ. అదే టైంలో అక్కడ కవరేజ్ కి వచ్చే కెమెరామెన్లు వీరిపై స్పెషల్ ఫోకస్ పెడతారు. ఆ ఫుటేజీలను సోషల్ మీడియా హ్యాండిల్స్ రకరకాలుగా వాడుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. అది కొత్త విషయం కాదు. కానీ కొంతమంది కెమెరామెన్లు హీరోయిన్ల ప్రైవేట్ పార్ట్స్ పై జూమ్ చేసి వీడియో షూట్ చేస్తుంటారు.
ఇవి కొంతమంది హీరోయిన్లను ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా హీరోయిన్ ఆషిక రంగనాథ్(Ashika Ranganath).. అలాంటి వారిపై ఫైర్ అవుతూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. ఇప్పుడు అది హాట్ టాపిక్ అవుతుంది.
ఆషికా రంగనాథ్ ఈ విషయం పై తన సోషల్ మీడియాలో స్పందిస్తూ…”పబ్లిక్ ఈవెంట్లలో ఫీమేల్ యాక్టర్లు ఉన్నప్పుడు, కొందరు మీడియా ఫోటోగ్రాఫర్లు వారిని అసభ్యకరమైన యాంగిల్స్‌లో ఫోటోలు తీయడం, అవసరం లేని విధంగా జూమ్ చేసి బాడీ పార్ట్స్‌ని షూట్ చేసి వీడియోలు షేర్ చేయడం వంటివి చేస్తున్నారు. ఇది రిపీటెడ్ గా జరుగుతుంది. పెద్ద సమస్యగా మారిపోయింది.
ఫోటోగ్రాఫర్లు లేదా కెమెరామెన్లు తమ క్రాఫ్ట్ (సినిమా/నటన) మీద కంటే మా శరీరాలపై ఫోకస్ పెట్టడం చాలా అగౌరవంగా అనిపిస్తుంది.ప్రొఫెషనలిజం, గౌరవంతో వాళ్ళు పనిచేస్తే బాగుంటుంది. ఇకపై ఇలాంటి వాటిని సహించం, ఇది మా ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. సినీ పరిశ్రమకి చెందిన మేమంతా ఏకతాటిపై నిలబడి, ఒకరికొకరు మద్దతుగా ఉండాలని నిర్ణయించుకున్నాం” అంటూ పేర్కొన్నారు.
ఆషికా రంగనాథ్ పోస్ట్ ని ‘కాంతార’ హీరోయిన్ సప్తమి గౌడ కూడా షేర్ చేశారు. ‘మీడియాలో మమ్మల్ని గౌరవించే అలాగే మాకు రక్షణగా ఉండే జర్నలిస్టులు,మీడియా మిత్రులు ఎంతో మంది ఉన్నారు. కొంతమంది మాత్రం ఫీమేల్ యాక్టర్స్ ని కెమెరాలతో తప్పుగా ప్రోజెక్ట్ చేస్తూ మమ్మల్ని అగౌరపరుస్తున్నారు.ఆ కొద్దిమందిపై పోరాడేందుకు మేము మంచి అనుకుంటున్న జర్నలిస్టులు సహకరించాలని కోరుకుంటున్నాం’ అంటూ సప్తమిగౌడ కూడా విన్నవించుకున్నారు.