దసరా కానుకగా విడుదలవుతున్న 4 సినిమాల్లో ‘గరివిడి లక్ష్మి’ (Garividi Lakshmi) కూడా ఒకటి. ఓ పుష్కరకాలం పాటు తన గాత్రంతో ఉత్తరాంధ్ర ప్రజలను ఉర్రూతలూగించిన రెడ్డి విజయలక్ష్మి అలియాస్ గరివిడి లక్ష్మి జీవిత కథతో రూపొందిన సినిమా ఇది. టాలీవుడ్ బడా బ్యానర్లలో ఒకటైన ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఈ ఏడాది ‘ది రాజాసాబ్’ చిత్రంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ‘పీపుల్ మీడియా..’ సంస్థ నుండి వస్తున్న సినిమా అయినప్పటికీ, ప్రమోషనల్ కంటెంట్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది ‘గరివిడి లక్ష్మి’. మరి ఈ సినిమాగా ఎంతవరకు మెప్పించిందో తెలుసుకుందాం రండి :
కథ: దేవుడమ్మ (Raasi) కొన్ని కారణాల వల్ల తన భర్త తాతినాయుడుని వదిలేసి, అతనికి వేరే పెళ్ళి చేసి పంపించేస్తుంది. ఇది తన కూతురు లక్ష్మికి (Anandhi) ఏమాత్రం నచ్చదు. చిన్నప్పుడే తండ్రి దూరమైపోవడంతో లక్ష్మి మానసిక క్రుంగిపోతుంది. దీంతో ఆమెకు 12 ఏళ్ల వయసు రాగానే దేవుడమ్మ పెళ్లి చేసేస్తుంది. అయితే, పెళ్లి చేసుకున్న వ్యక్తి మోసం చేయడంతో లక్ష్మి తిరిగి తల్లి వద్దకే చేరుతుంది. లక్ష్మికి చిన్నప్పటి నుండీ పాటలు పాడటం అంటే చాలా ఇష్టం. చదువు రాకపోయినప్పటికీ ఎలాంటి పాటనైనా ఇట్టే నేర్చుకుని పాడేస్తూ ఉంటుంది. తర్వాత కొంతమంది సాయంతో బుర్రకథలను పాటలుగా పాడటం నేర్చుకుంటుంది. ఈ క్రమంలో ఆమెకు సత్యం (Rag Mayur) అనే వ్యక్తి పరిచయమవుతాడు.
అతని ట్రూప్‌లో (బృందంలో) చేరి, 3 గంటల బాలనాగమ్మ కథను బుర్రకథ రూపంలో పాడి పాపులర్ అయిపోతుంది లక్ష్మి. ఆ తర్వాత స్నేహితురాలు విజయ(శరణ్య ప్రదీప్), స్నేహితుడు రాంబాబు (నరేష్ వి.కె) సాయంతో సొంతంగా ఒక ట్రూప్ ఏర్పాటు చేసుకుంటుంది. క్రమక్రమంగా ఆమె ఉత్తరాంధ్ర అంతటా పాపులర్ అవుతుంది. మరోవైపు ఆమె సత్యంని ఇష్టపడుతుంది. కానీ, పెళ్లి తనకు కలిసిరాదని భావించి సహజీవనానికే మక్కువ చూపుతుంది. ఆ తర్వాత ఆమె తల్లి మరణించడం, ఒక దశలో సత్యంతో పాటు నమ్మిన వారంతా మోసం చేసి లక్ష్మీకి దక్కాల్సిన గుర్తింపు దక్కకుండా చేసేస్తారు. దీనివల్ల ఆమె జీవితం ఎలా పాడైపోయింది అనేది మిగిలిన కథ.
నటీనటుల పనితీరు: తమిళంలో ఆనందికి మంచి పాత్రలు, మంచి సినిమాలు పడ్డాయి. కానీ తెలుగు ఫిల్మ్ మేకర్స్ ఆమె టాలెంట్‌ను పూర్తిస్థాయిలో ఉపయోగించుకోలేదనే చెప్పాలి. దాదాపు 13 ఏళ్ల తర్వాత ఆనందికి ‘గరివిడి లక్ష్మి’ (Garividi Lakshmi) రూపంలో గొప్ప పాత్ర లభించింది. ఇలాంటి పాత్ర మళ్ళీ తనకు దొరకదు అనుకుందో ఏమో కానీ.. ‘గరివిడి లక్ష్మి’ పాత్రకు నూటికి నూరు శాతం న్యాయం చేసింది. ఇంకో మాటలో చెప్పాలంటే గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఒదిగిపోయింది.
ఈ పాత్రకు ఆనంది తప్ప ఎవరూ సరిపోరు అనుకునేంత హానెస్ట్‌గా పెర్ఫార్మ్ చేసింది. ఆనందిని తప్ప ఈ పాత్రలో మరెవ్వరినీ ఊహించుకోలేం. ఆనంది తర్వాత ఎక్కువ మార్కులు సీనియర్ నరేష్‌కు పడతాయి. ఆయన చాలా అద్భుతంగా నటించాడు. రాగ్ మయూర్ కూడా బాగానే చేశాడు. అతని పాత్రను చూస్తున్నంతసేపు ‘మహానటి’లో దుల్కర్ సల్మాన్, మహేష్ ఆచంట పాత్రలు గుర్తుకొస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.
కాకపోతే అతని భార్య పాత్రకి తీసుకున్న నటి మాత్రం అస్సలు సెట్ అవ్వలేదు. అది కూడా ముఖ్యమైన పాత్రే కాబట్టి.. కాస్త తెలిసిన నటిని తీసుకోవాల్సింది. ఆ పాత్ర ఒక్కటే మిస్ మ్యాచ్ అనిపిస్తుంది. ఇక అంకిత్ కొయ్య, షకలక శంకర్, శరణ్య ప్రదీప్, రాశి, అవసరాల శ్రీనివాస్, ఎల్ బి శ్రీరామ్, వైవా రాఘవ వంటి వారంతా కనిపించినంత సేపు తమ శైలి నటనతో పర్వాలేదు అనిపించారు.
సాంకేతిక నిపుణుల పనితీరు: ఈ తరంలో చాలా మందికి ‘గరివిడి లక్ష్మి’ (Garividi Lakshmi) అంటే ఎవరో తెలియదు. కానీ 1990ల కాలంలో ఉత్తరాంధ్ర జానపదాలను బుర్రకథలుగా పాడి, అక్కడి జనాలను ఆమె ఉర్రుతలూగించారు. దాదాపు 12 ఏళ్ల పాటు క్షణం తీరిక లేకుండా బుర్రకథ కార్యక్రమాల్లో పాల్గొనేవారు. ఆ తర్వాత ఆమె బుర్రకథలను క్యాసెట్ల రూపంలో చేసి మార్కెట్లోకి వదిలేవారు. అవి విపరీతంగా సేల్ అయ్యేవి. ఆ క్యాసెట్లను పంపిణీ చేసిన వారంతా భారీ లాభాలు ఆర్జించిన సందర్భాలు ఉన్నాయి. ఆమె ప్రతిభను ఎవరెవరో క్యాష్ చేసుకున్నారు. కానీ ఆమెకి దక్కాల్సిన గౌరవం దక్కలేదు. ఆమె తన జీవితంలో ఎదుర్కొన్న సమస్యలు అన్నీ ఇన్నీ కావు.
ముఖ్యంగా సంగీత దర్శకుడు ఆర్ పి పట్నాయక్ సైతం ఆమె పాటల ద్వారా పాపులారిటీ సంపాదించుకుని ఆమెకు క్రెడిట్ ఇవ్వకపోవడం బాధాకరం. ఆ విషయాన్ని కూడా దర్శకుడు ఈ సినిమాలో ప్రస్తావించాడు. దర్శకుడు గౌరి నాయుడు ఆలోచనను అభినందించాల్సిందే. గరివిడి లక్ష్మి జీవితంలో ఎంతో ఎమోషన్, పెయిన్ ఉన్నాయి. అవి ఏమాత్రం మిస్ కాకుండా తెరపై ఆవిష్కరించడంలోనూ అతను సక్సెస్ అయ్యాడు. ఫస్ట్ హాఫ్ అంతా గరివిడి లక్ష్మి ప్రపంచాన్ని పరిచయం చేశాడు. చాలా రేసీగా ఉంటుంది, అప్పుడే అయిపోయిందా అనే ఫీలింగ్ ఇస్తుంది.
ఇక సెకండాఫ్ కి వచ్చేసరికి ఎక్కడా సినిమా చూస్తున్నామనే ఫీలింగ్ కలగదు. తెరపై వచ్చే పాత్రలతో ఆడియన్స్ ట్రావెల్ అయ్యేలా చాలా చక్కగా మలిచాడు దర్శకుడు. కొన్ని సన్నివేశాలు, సంభాషణలు హృదయాన్ని హత్తుకుంటాయి. ఈ సినిమాకు సంగీతం ప్రాణం. చరణ్ అర్జున్ బెస్ట్ మ్యూజిక్ ఇచ్చాడు. ‘నల్లజీలకర్ర మొగ్గ’ పాట అమితంగా ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ కూడా క్వాలిటీగా ఉంది. 1990ల వాతావరణాన్ని చక్కగా పిక్చరైజ్ చేశాడు సినిమాటోగ్రాఫర్. నిర్మాత కృతి ప్రసాద్ అభిరుచిగల నిర్మాత అని ఈ సినిమాతో నిరూపించుకున్నారు.
విశ్లేషణ: ‘గరివిడి లక్ష్మి’ (Garividi Lakshmi) కచ్చితంగా ఓ గొప్ప ప్రయత్నం. చాలా ఫ్రెష్ గా ఉంది. అథెంటిక్ ఫీల్ ఇస్తుంది. కనుమరుగైపోయిన కళాకారుల జీవితాలని, వారి ఆటుపోట్లను ఈ తరానికి అర్థమయ్యేలా వివరిస్తూ తెరకెక్కించడం అనేది చాలా అవసరం. అన్ని వర్గాల ప్రేక్షకులు తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది.
ఫోకస్ పాయింట్: చిందులేయించి…కంటతడి పెట్టించే ‘గరివిడి లక్ష్మి’
రేటింగ్: 3/5