గౌతమి పుత్ర శాతకర్ణి ట్రైలర్ రివ్యూ!
- December 16, 2016 / 02:03 PM ISTByFilmy Focus
నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ట్రైలర్ శుక్రవారం సాయంత్రం రిలీజ్ అయి నటసింహ జైత్రయాత్రకు తెరలేపింది. జాతీయ అవార్డు గ్రహీత క్రిష్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న బాలయ్య వందో చిత్రం ఎలా ఉంటుందో? అనే అభిమానుల అనుమానాలను ఈ వీడియో పటాపంచలు చేసింది. శాతవాహన చక్రవర్తిగా బాలకృష్ణ రాయల్ లుక్ లో కనిపించి రికార్డులపై కత్తి దూశారు. ఇందులో ఆయన చెప్పిన రెండు భారీ డైలాగులు చిత్రం బ్లాక్ బస్టర్ అని చెప్పకనే చెబుతున్నాయి.
“మా జైత్ర యాత్రని గౌరవించి .. మా ఏలుబడిని అంగీకరించి, మీ వీర ఖడ్గాన్ని మా రాయబారికీ స్వాధీనం చేసి, మాకు సామంతులు అవుతారని ఆశిస్తున్నాం .. సమయం లేదు మిత్రమా .. శరణమా.. రణమా”… ఈ డైలాగ్ బాలయ్య నోటి నుంచి వస్తుంటే రోమాలు నిక్కపొడుచుకుంటున్నాయి. “ఇప్పటికి ఉనికి నిలుపుకున్నాం .. ఇక ఉనికి చాటుకుందాం.. నూతన నిర్మాణమైన భారత రాజ్యాన్ని పరదేశం నెత్తుటితో ప్రక్షాళన చేద్దాం.. దొరికిన వాణ్ణి తురుముదాం.. దొరకని వాణ్ణి తరుముదాం.. ఏది ఏమైనా దేశం మీసం తిప్పుదాం.” అని నటసింహ మీసం తిప్పితుంటే ఒంట్లో రక్త ప్రవాహం వేగం పుంజుకుంటోంది. చిరంతన్ భట్ సమకూర్చిన సంగీతం బాలకృష్ణ పోరాటానికి బలాన్ని ఇస్తోంది. బాలీవుడ్ నటి హేమ మాలిని అనుభవం, శ్రీయ శరణ్ అభినయం ఈ చిత్రానికి ప్లస్ కానుంది. రాజీవ్ రెడ్డి, సాయి బాబు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా రిలీజ్ అవుతుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.
















