సినిమా ఇండస్ట్రీలో మరో జంట పెళ్లి పీటలెక్కబోతోందా? అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. గత కొంతకాలంగా డేటింగ్లో ఉన్న యువ నాయకనాయికలు పెళ్లి పీటలు ఎక్కాలని నిర్ణయించుకున్నారట. గతంలో వీరిద్దరూ ఓ సినిమాలో నటించారు కూడా. ఆ సందర్భంగానే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందని, ఇప్పుడు కలసి ఒకటవుదామని చూస్తున్నారట. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే త్వరలోనే ప్రేమను, పెళ్లిని అనౌన్స్ చేస్తారట. వారెవరో కాదు గౌతమ్ కార్తిక్, మంజిమా మోహన్.
మంజిమా మోహన్ మనకు ఇప్పటికే పరిచయమున్న అమ్మాయే. నాగచైతన్యతో ‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమాలో నటించింది. ఆ తర్వాత తెలుగులో పెద్దగా సినిమాలు రాలేదు. కానీ తమిళం, మలయాళంలో సినిమాలు చేస్తోంది. మరోవైపు గౌతమ్ కార్తిక్ అంటే అలనాటి నటుడు కార్తిక్ తనయుడు. ‘కడలి’ సినిమాతో వెండితెరకు పరిమయ్యాడు. ఆ సినిమా ఆశించిన విజయం అందుకోలేదు. కానీ గౌతమ్ కూడా తమిళంలో సినిమాలు చేస్తున్నాడు. ఈ ఇద్దరూ ‘దేవరాట్టం’ అనే సినిమాలో కలసి నటించారు.
అప్పటి నుండే ఇద్దరి మధ్య ప్రేమ ఉందట. ఈ సినిమా తర్వాత కూడా గౌతమ్, మంజిమ అప్పుడప్పుడు మీడియా కంట పడేవారట. ఏంటి విషయం అంటే తొలినాళ్లలో ఏం లేదు అనేవారు. కానీ ఆ తర్వాత ఇద్దరూ డేటింగ్లో ఉన్నారు అనే టాక్ అయితే నడిచింది. వీరిద్దరూ చెన్నైలో సహజీవనం చేస్తున్నారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఎట్టకేలకు ప్రేమ వ్యవహారాన్ని… పెళ్లి పీటల వరకు తీసుకెళ్తున్నారట. వీరి ప్రేమకు ఇరు కుటుంబ పెద్దలు అంగీకారం తెలిపారట.
దీంతో ఈ ఏడాది ఆఖర్లో మంజిమ – గౌతమ్ పెళ్లి జరిగే అవకాశం ఉందని కోడంబాక్కం వార్తలు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని అంటున్నారు. మంజిమ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. అందులో ‘క్వీన్’ మలయాళ రీమేక్ ఎప్పటిదో.. ఇంకా విడుదల కాలేదు. ఇది కాకుండా ‘అక్టోబర్ 31st లేడీస నైట్’ అనే సినిమాలో నటించింది. ఈ సినిమా తెలుగులోకి కూడా వస్తోంది. ఇక గౌతమ్ విషయానికొస్తే… ‘యుత సతమ్’, ‘పాతు తళ’ అనే సినిమాలు చేస్తున్నాడు.